ఆన్‌లైన్‌ లోన్ యాప్‌ కేసు దర్యాప్తు..10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఆన్‌లైన్‌ లోన్ యాప్‌ కేసు దర్యాప్తు..10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Online loan app case investigation : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న ఆన్‌లైన్‌ లోన్ యాప్‌ కేసు దర్యాప్తు వేగవంతం చేశారు. సైబర్‌ క్రైం పోలీసులు. ముఖ్యంగా లోన్‌ తీసుకున్న వ్యక్తులకు ఫోన్లు చేసి ఇబ్బంది పెడుతున్న కాల్‌ సెంటర్లపై దాడులు నిర్వహించారు. సైబరాబాద్‌లో నలుగురిని, హైదరాబాద్‌లో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. మరికాసేపట్లో వారిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.

యాప్‌ల దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగుచూడడంతో వాటి ప్రతినిధులు, టెలీ కాలర్ల మధ్య లావాదేవీల పై దృష్టి సారించారు పోలీసులు. ప్రతీ నెల టెలికాలర్‌కు జీతాల చెల్లింపు ఎక్కడి నుంచి జరుగుతుందనే అంశంపై దర్యాప్తు జరుపుతున్నారు. ఢిల్లీలోని గురుగ్రాం సమీపంలో 16 యాప్‌లకు సంబంధించిన 10 కాల్‌ సెంటర్లపై దాడులు చేయగా… అక్కడ 400 మంది టెలి కాలర్లుగా పని చేస్తున్నట్టు గుర్తించారు. ఇక్కడ కాల్‌ సెంటర్ ప్రతినిధులు 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి ద్వారా పోలీసులు మరింత సమాచారం రాబట్టారు.

గురుగ్రాం కాల్ సెంటర్లలో దొరికిన డేటా ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్న కాల్‌ సెంటర్లపై దాడులు చేశారు సైబర్‌ క్రైం పోలీసులు. హైదరాబాద్‌ కాల్‌ సెంటర్లలో 700 మంది టెలీకాలర్లుగా పని చేస్తున్నట్టు ఇప్పటి వరకు గుర్తించారు. కాల్ సెంటర్ల పనితీరుపై వీరిని విచారించగా…. టెలీ కాలర్లను S1, S2, S3 లుగా విభజించి పనులు అప్పగిస్తున్న విషయాన్ని పోలీసులు గుర్తించారు. సకాలంలో లోన్ రికవరీ చేయించిన టెలీ కాలర్లకు జీతంతో పాటు అదనంగా 10 వేల రూపాయల నుంచి 20 వేల రూపాయల వరకు ఇన్సెంటివ్‌లు అందిస్తున్న అంశం పోలీసు విచారణలో వెలుగు చూసింది.