బెంచీకి ఒక్క విద్యార్థే, స్కూల్స్‌లో ప్రభుత్వం కొత్త రూల్

బెంచీకి ఒక్క విద్యార్థే, స్కూల్స్‌లో ప్రభుత్వం కొత్త రూల్

only one student for bench, new rule in schools: మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ముఖ్యంగా స్కూల్స్ లో విద్యార్థుల క్షేమంపై ఫోకస్ చేసింది. మహారాష్ట్రలో ఒకే స్కూల్ కి చెందిన 229మంది విద్యార్థులు కరోనా బారిన పడటం కలకలం రేపింది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం.. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్ లో కొత్త రూల్ తెచ్చింది. పాఠశాలల్లో బెంచీకి ఒక్క విద్యార్థినే కూర్చోబెట్టాలని చెప్పింది. అలాగే, మొత్తంగా తరగతి గదిలో 20 మందిని మాత్రమే కూర్చోబెట్టాలది. ప్రతి ఇద్దరు విద్యార్థుల మధ్య కనీసం ఆరడుగుల భౌతిక దూరం పాటించాల్సిందేనని తేల్చి చెప్పింది.

రూల్స్ బ్రేక్ చేస్తే కఠిన చర్యలు:
ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన స్పష్టం చేశారు. ఈ నిబంధనలను రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ అమలు చేయాల్సిందేనని ఆమె చెప్పారు. వాటిని అమలు చేయని స్కూల్స్ పై అంటువ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. కోవిడ్‌ నిబంధనలు పాటించని పాఠశాలల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించిన నేపథ్యంలో నిబంధనల అమలు విషయంలో పక్కాగా వ్యవహరిస్తామని తెలిపారు. మూడు, నాలుగు రోజుల్లో స్కూళ్లలో తనిఖీలు చేయనున్నట్లు దేవసేన వెల్లడించారు.

త్వరలో స్కూళ్లలో తనిఖీలు:
ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతుల ప్రత్యక్ష బోధన ప్రారంభించామని.. 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన బుధవారం(ఫిబ్రవరి 24,2021) నుంచి ప్రారంభించిన నేపథ్యంలో మరో మూడు, నాలుగు రోజుల్లో సీనియర్‌ అధికారుల నేతృత్వంలోని బృందాలు పాఠశాలల్లో తనిఖీలు చేస్తాయని వెల్లడించారు. మరోవైపు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు కూడా పాఠశాలల నిర్వహణను పర్యవేక్షిస్తాయని తెలిపారు. ప్రతి పాఠశాల నిబంధనలను పాటించాల్సిందేనని, తరగతి గదులు సరిపోకపోతే, విద్యార్థులు ఎక్కువగా ఉంటే షిఫ్ట్‌ విధానంలో నిర్వహించుకోవచ్చని, జిల్లా కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

బెంచీకి ముగ్గురు, నలుగురు విద్యార్థులను కూర్చోబెడితే రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలతో పాటు, అంటువ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారం పాఠశాలలపై చర్యలు తప్పవన్నారు.