ఆపరేషన్ పులి.. కొనసాగుతున్న వేట, పాద ముద్రల ఆధారంగా గాలింపు

  • Published By: naveen ,Published On : November 16, 2020 / 12:15 PM IST
ఆపరేషన్ పులి.. కొనసాగుతున్న వేట, పాద ముద్రల ఆధారంగా గాలింపు

operation tiger: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేసిన కొత్త పులి జాడ ఇంకా దొరకలేదు. తప్పించుకు తిరుగుతున్న పులి కోసం ఐదో రోజు బెజ్జూరు, పెంచికల్ పేట్, దహెగాం అడవి ప్రాంతంలో గాలింపు జరిపారు.




దహెగాం మండలం దిగిడ అడవి ప్రాంతంలో నాలుగు బోన్లను కూడా ఏర్పాటు చేశారు. అయితే పాద ముద్రల ఆధారంగా పులి మహారాష్ట్ర వైపు వెళ్లి ఉంటుందని అటవీశాఖ అధికారులు భావిస్తున్నారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను హడలెత్తిస్తున్న పెద్దపులులు:
కొన్ని రోజులుగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను పెద్దపులులు హడలెత్తిస్తున్నాయి. మేతకు వెళ్లిన పశువులపైనే కాకుండా అటుగా వచ్చిన మనుషులపైనా దాడులు చేస్తున్నాయి. దీంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కంటి నిండా కునుకు లేకుండా పోయింది. పులి భయంతో వారం రోజులుగా రైతులు పొలాలకు వెళ్లకుండా భయం భయంగా గడుపుతున్నారు.

మళ్లీ పెరిగిన పులుల సంచారం:
ఉమ్మడి ఆదిలాబాద్‌లో పెరిగిన పులుల సంచారం.. పెద్దపులి దర్శనంతో బయటికెళ్లని జనం.. కొద్ది రోజులుగా ఆదిలాబాద్, మంచిర్యాల, కుముర్రంభీం జిల్లాలో మళ్లీ పులుల సంచారం పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలో ఇందూర్ పల్లి, గొల్లఘాట్ గ్రామాల్లో పులి సంచరిస్తోంది. ఇటీవల మేతకు వెళ్లిన నాలుగు ఆవులపై పులి దాడి చేసింది. పెద్దపులి ఇలా నిత్యం దర్శనం ఇవ్వడంతో ఈ ప్రాంతంలోని మారుమూల గ్రామాలలోని జనాలు జంకుతున్నారు.

ఇతర ప్రాంతాలు, పొలాలకు వెళ్లేలేకపోతున్న జనం:
బెజ్జూర్‌ మండలం నుండి పెంచికల్ పేట్ మండలానికి వెళ్ళే మార్గంలో వారం రోజుల క్రితం రోడ్డుపై దాదాపు కిలోమీటర్ మేర నడుచుకుంటూ పెద్దపులి వెళ్ళింది. ఈ పెద్దపులి వెళ్ళే వీడియోను సెల్ ఫోన్ తో ప్రయాణికుడు తీసాడు. అప్పటి నుంచి ఊళ్లకు, పొలాలకు వెళ్లే వారు భయంతో ఇంట్లోనే ఉండిపోతున్నారు. పెద్ద పులి ఎప్పుడు ఎక్కడ నుంచి అటాక్ చేస్తుందోనని వణికిపోతున్నారు.

మంచిర్యాల జిల్లాలో రెండు పులుల సంచారం:
అటు మంచిర్యాల జిల్లా హాజీపూర్, చెన్నూరు అటవీ ప్రాంతాల్లో రెండు పులులు సంచరిస్తున్నాయి. అక్కడా మేతకు వెళ్లిన పశువులపై దాడి చేశాయి. చెన్నూరు మండలం, శివలింగాపూర్, హజీపూర్ మండలం, నంనూరులో పులుల దాడిలో పశువులు మరణించాయి. వేమనపల్లి, కోటపల్లి, నిన్నెల, జైపూర్ అటవీ ప్రాంతంలో పులులు నిత్యం సంచరిస్తున్నాయి.

ప్రత్యేక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసిన అధికారులు, ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరిక:
కుముర్రం భీం జిల్లా కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలో పులుల సంచారం పెరిగింది. దీంతో అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రత్యేక బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో… పశువులను అడవిలోకి పంపవద్దని.. ప్రజలు కూడా అడవిలోకి వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిత్యం పెద్దపులి దర్శనమిస్తుండడంతో.. గిరిజనుల్లో భయం నెలకొంది. పొలాలకు వెళ్లలేక, ఇతర పనులు చేసుకోలేక ఇంట్లోనే ఉండిపోతున్నారు. దీంతో అటు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎలాగైనా పులులను బంధించి తమను రక్షించాలని వేడుకుంటున్నారు.