తెలంగాణలో మరో రెండ్రోజులపాటు వానలు…రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

  • Published By: bheemraj ,Published On : August 20, 2020 / 06:58 PM IST
తెలంగాణలో మరో రెండ్రోజులపాటు వానలు…రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు

వాయుగుండం ప్రభావంతో రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఉమ్మడి వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో ఒకటి..రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

వరంగల్ నగరంలో వరద బీభత్సం కొనసాగుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నీరు ఇప్పటికీ నిలిచే ఉంది. ముంపునకు గురైన కాలనీల్లో పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. వరద ఉధృతి వల్ల 70కి పైగా ప్రాంతాలు నీట మునిగాయి. వీటిలో సుమారు 40కి పైగా కాలనీల్లో రెండు నుంచి మూడు మీటర్ల ఎత్తు వరకు వరద నీరు ప్రవహిస్తుండటంతో నాలుగు రోజులుగా ప్రజలు ఇళ్లళ్లోనే చిక్కుకుపోయారు. ఇక ప్రాజెక్టులకు భారీగా నీరు చేరడం, చెరువులు, జలపాతాలకు వరద పోటెత్తడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు.

మరోవైపు జిల్లాలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. చాలా చోట్ల రోడ్లు వరద తాకిడితో కోతకు గురైంది. వానకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వాగులు, వంకలు, చెరువులు పొంగిప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టులు నిండు కుండలను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జల వలయంలో చిక్కుకున్నాయి. చాలా చోట్ల పంటలకు నష్టం వాటిల్లింది.

మరోవైపు ఏర్లు, వాగులు, చెరువుల అలుగల నుంచి వచ్చిన వరదతో పంట పొలాల్లో నీరు చేరింది. ఎగువ నుంచి వరదతో ఖమ్మం నగరానికి ఆనుకుని ప్రవహిస్తున్న మున్నేరు వాగు పొంగి ప్రవహిస్తోంది. దీంతో మున్నేరుకు తీరంలోని ముంపు ప్రాంతాలైన బొక్కలగడ్డ, పద్మావతి నగర్, వెంకటేశ్వర నగర్, మోతీనగర్, సుందరయ్య నగర్ తదితర కాలనీల్లోకి వరద నీరు చేరింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆయా ప్రాంతాల్లోని సుమారు వంద కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు.

వరంగల్, హన్మకొండ, హైదరాబాద్, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే వరంగల్ నగరంలో చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. హన్మకొండలో రోడ్లన్ని చెరువులను తలపిస్తూ వాన నీటితో నిండిపోయాయి. వరంగల్ నగరం ఇంకా జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. చాలా చోట్ల ప్రజలు ఇళ్లళ్లోనే చిక్కుకున్నట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణలో రానున్న మరో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని..భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో జనజీవనం స్థంభించి పోయింది. భద్రాచలం దగ్గర గోదావరి ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. ఇక తీరంలోని గ్రామాలు విలవిల్లాడుతున్నాయి.

మణుగూరు, అశ్వాపురం, ఇల్లందు, ఆళ్లపల్లి, గుండాలలోని పలు వాగులు ఉప్పొంగడంతో పంటలు నీట మునిగాయి. అలాగే కిన్నెరసాని పరివాహక ప్రాంతంలోని రాజాపురం, యానంబైలు, పాండురంగాపురం, నాగారం, నారాయపేటతోపాటు పలు ప్రాంతాల్లో వరి, పత్తి పంట నీటి ముంపునకు గురయ్యాయి.