Telangana Cabinet : తెలంగాణ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ..నలుగురు మంత్రులపై వేటు ?

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేబినెట్ మార్పు తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక.. దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Telangana Cabinet : తెలంగాణ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ..నలుగురు మంత్రులపై వేటు ?

Telangana Cabinet

Reorganization of the Telangana Cabinet : తెలంగాణ మంత్రివర్గం మార్పుపై కొంత కాలంగా రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఇప్పటివరకు కేబినెట్ మార్పు విషయంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ తాజాగా కేబినెట్‌ మార్పు అంశం కీలక దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ఎవరు ఇన్, ఎవరు ఔట్.. అనేది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కేబినెట్ మార్పు తెరపైకి వచ్చింది. టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చాక.. దాదాపు ఏడాదిన్నర కాలం తర్వాత సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే ఏప్రిల్ 17న సాగర్ ఉప ఎన్నిక జరగనుంది. 27న టీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవం, పార్టీ ప్లీనరీని నిర్వహించనున్నారు. దీంతో పాటు మే నెలలో యాదాద్రి దేవాలయం పునఃప్రారంభం చేయనున్నారు సీఎం కేసీఆర్. ఈ సందర్భంగా ప్రత్యేకంగా యాగం కూడా నిర్వహించనున్నారు. ఆ వెంటనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందంటున్నారు. 2019 సెప్టెంబర్‌లో జరిపిన విస్తరణలో… కేసీఆర్.. ఆరుగురు మంత్రులను అదనంగా కేబినెట్‌లో చేర్చుకున్నారు. ఇప్పుడు మరోసారి కేబినెట్ మార్పులు జరగనున్నాయన్న సమాచారంతో ఆశావహుల పేర్లు తెరపైకి వస్తున్నాయి.

శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, హన్మకొండ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక మరో పేరు కూడా జోరుగా ప్రచారం సాగుతోంది. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు కూతురు సురభి వాణీ దేవిని కూడా మంత్రిని చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. రైతు బంధు సమితి ఛైర్మన్ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి కూడా కేబినెట్ బెర్త్ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

వీళ్లతో పాటు.. కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవిత పేరు కూడా తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కేసీఆర్ కుటుంబం నుంచి కొడుకు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు.. కేబినెట్‌లో మంత్రులుగా సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు కవితకు కూడా ఛాన్స్ ఇస్తే… కుటుంబ పాలన అంటున్న కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలు మరింతగా విమర్శల ధాటిని పెంచే అవకాశం ఉందనే అభిప్రాయం విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.

మరోవైపు పనితీరు సరిగా లేని మంత్రులపై వేటు పడే అవకాశముంది. సీఎం కేసీఆర్ ప్రధానంగా ముగ్గురు లేదా నలుగురు మంత్రులపై అసంతృప్తితో ఉన్నారన్నది విశ్వసనీయ సమాచారం. వారిలో ఒకరు గ్రేటర్ హైదరాబాద్‌ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుంటే.. మరో ఇద్దరు కరీంనగర్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక దక్షిణ తెలంగాణ నుంచి కూడా ఒకరిని తప్పిస్తారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. పనిచేసే మంత్రులకే ప్రాధాన్యం ఇస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్ బహిరంగంగా చెప్పారు.

ఇందుకు సంబంధించి ప్రతి 3 నెలలకు ఓసారి మంత్రుల పనితీరుపై నిఘావర్గాల నుంచి సీఎం కేసీఆర్ నివేదికలు తెప్పించుకుంటున్నట్లు సమాచారం. మొత్తానికి మంత్రుల పనితీరు.. ఇటీవల వచ్చిన ఎన్నికల ఫలితాలు, భవిష్యత్తులో ఆయా జిల్లాల్లో పార్టీ గెలుపునకు సంబంధించిన అంశాలను కేసీఆర్ లెక్కలోకి తీసుకునే అవకాశముంది. వీటి ఆధారంగానే కేబినెట్‌లో మార్పులు, చేర్పులు ఉండనున్నాయని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సీఎం సారు ఎలా డిసైడ్ చేస్తారో చూడాలి మరి.