వచ్చే 90 రోజులు జాగ్రత్త, మాస్క్ మస్ట్, కరోనా సెకండ్ వేవ్ పై తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెచ్చరిక

  • Published By: naveen ,Published On : November 4, 2020 / 12:37 PM IST
వచ్చే 90 రోజులు జాగ్రత్త, మాస్క్ మస్ట్, కరోనా సెకండ్ వేవ్ పై తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెచ్చరిక

corona second wave: కరోనా సెకండ్‌ వేవ్‌.. తెలంగాణ ప్రజలను కలవర పెడుతున్న మాట.. తెలంగాణ వైద్యారోగ్యశాఖ తాజా సూచనలు కూడా ఇందుకే ఊతమిస్తున్నాయి. వచ్చే 90 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య డైరెక్టర్‌ డాక్టర్‌ శ్రీనివాసరావు. చలికాలంలో కరోనా మరింత విజృంభించే అవకాశాలున్నాయన్నారు. చలికాలం అన్ని వైరస్‌లకు అనుకూల సమయమని.. కోవిడ్‌ లక్షణాలైన ఫ్లూ, జ్వరం, జలుబు, పొడి దగ్గు వంటివన్నీ ఈ కాలంలోనే వస్తాయని చెప్పారు. రాబోయే కాలంలో పండగ సీజ్‌లు వస్తున్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నా.. చలికాలంలో సీజనల్‌ వ్యాధులు వెంటాడతాయన్నారు వైద్యారోగ్యశాఖ డైరెక్టర్. ప్రభుత్వం కరోనా కట్టడికి అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని చెప్పారు. వచ్చే 3 నెలలు అత్యంత కీలకం కానున్నందున వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు అవసరమైన ఎమర్జెన్సీ సేవలకు సిద్ధం కావాలన్నారు. అధిక శాతం ప్రజలు మాస్కులు పెట్టుకోకుండా తిరుగుతున్నారని.. అలా తిరగడం ప్రమాదకరమని హెచ్చరించారు.

చలికాలం అన్ని వైరస్‌లకు అనుకూల సమయం అని, చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ఇంటి నుంచి బయటకు వస్తే ప్రతి ఒక్కరూ మస్ట్ గా మాస్క్ ధరించాలన్నారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించాలన్నారు. అలాగే చేతులను తరుచుగా శుభ్రం చేసుకోవాలన్నారు. ఇక పండుగలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తలు పాటించాలని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు.