తెలంగాణలో ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు, వారి జీవిత విశేషాలు

  • Published By: madhu ,Published On : November 14, 2020 / 07:18 AM IST
తెలంగాణలో ముగ్గురికి ఎమ్మెల్సీ పదవులు, వారి జీవిత విశేషాలు

Three MLC posts in Telangana : గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాలను తెలంగాణ ప్రభుత్వం ఖరారు చేసింది. సామాజిక సమీకరణాలు దృష్టిలో ఉంచుకుని మూడు స్థానాలను భర్తీ చేయాలని భావించిన ప్రభుత్వం.. ప్రజా గాయకుడు గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. ఎస్సీ కోటాలో గోరటి వెంకన్న, బీసీ కోటాలో మాజీమంత్రి బస్వరాజు సారయ్య, ఓసీ కోటాలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన బొగ్గారపు దయానంద్ గుప్తా పేర్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. తెలంగాణ కేబినెట్ సమావేశంలో వీరి పేర్లు ఖరారు చేశారు. వారి పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేయనున్నారు.



గోరటి వెంకన్న : –
గోరటి వెంకన్నకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమంలో పని చేసిన వారికి అవకాశం ఇవ్వడంతో పాటు ఎస్సీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు అవుతుందని టీఆర్ఎస్ భావిస్తోంది. పల్లె కన్నీరు పెడుతుందో అని తెలంగాణ ప్రజా జీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవిగా.. గాయకుడు గోరటి వెంకన్నకు పేరుంది. తెలంగాణ భాషను, యాసను ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమ ఆకాంక్షను మరింత బలోపేతం చేశారు. గాయకుడిగానే కాకుండా.. పలు పుస్తకాలను వెంకన్న రాసారు. అలాగే.. హంస, కాళోజీ అవార్డులతో ప్రభుత్వం సత్కరించింది.



బస్వరాజు సారయ్య : –
ఇక ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక.. కేసీఆర్‌ నాయకత్వాన్ని బలపరుస్తూ.. బస్వరాజు సారయ్య 2014లో టీఆర్‌ఎస్‌లో చేరారు. మాజీ మంత్రిగా చేసిన సారయ్యకు.. ఏదో ఒక పదవి ఇస్తారని పార్టీలో చేరినప్పటి నుంచి ఊహాగానాలు వచ్చాయి. కానీ… పదవి మాత్రం దక్కలేదు. అయితే.. బీసీ సామాజిక వర్గానికి చెందిన బస్వరాజు సారయ్యకు ఇప్పుడు ఎమ్మెల్సీ అవకాశం వచ్చింది. 1955లో జన్మించిన బస్వరాజు సారయ్య.. రజక సంఘం జాతీయ నాయకుడుగా ఉన్నారు. మూడు సార్లు కౌన్సిలర్‌గా గెల్చిన ఆయన… ఆ తర్వాత 1999, 2004, 2009లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2012నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీ వెల్ఫేర్ మంత్రిగా చేశారు. త్వరలోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికల నేపథ్యంలో బీసీ నేత బస్వరాజు సారయ్యకు ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తూ టీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.



బొగ్గారపు దయానంద్ : –
ఇక ఓసీ కోటాలో వైశ్య సామాజిక వర్గానికి చెందిన బొగ్గారపు దయానంద్ గుప్తాను ఎమ్మెల్సీ పదవి వరించింది. ప్రస్తుతం ఆయన వాసవి సేవా కేంద్రానికి లైఫ్ టైమ్ చీఫ్ అడ్వయిజర్‌గా ఉన్నారు. 2003లో టీడీపీ నుంచి రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన దయానంద్ గుప్తా.. 2014లో టీఆర్ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. మెంబర్‌షిఫ్ డ్రైవ్‌లో కూడా ఉత్సాహంగా పాల్గొని వేలాదిమందని పార్టీలో జాయిన్ చేశారు.
నాయిని నర్సింహారెడ్డి, రాములు నాయక్, కర్నె ప్రభాకర్‌ పదవీ కాలపరిమితి ముగియడంతో ఈ ఏడాది ఆగస్టు నుంచే శాసనమండలిలో గవర్నర్‌ కోటా స్థానాలు ఖాళీగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీఆర్ఎస్ గవర్నర్ కోటాలోని ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని నిర్ణయించింది. శనివారం ఈ ముగ్గురు ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.