YS Sharmila Satires : అమ్మకు అన్నం పెట్టలేనోడు.. కేసీఆర్ జాతీయ పార్టీపై వైఎస్ షర్మిల సెటైర్లు

సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు చనిపోతుంటే ఆదుకోని కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు.

YS Sharmila Satires : అమ్మకు అన్నం పెట్టలేనోడు.. కేసీఆర్ జాతీయ పార్టీపై వైఎస్ షర్మిల సెటైర్లు

YS Sharmila Satires : సీఎం కేసీఆర్ జాతీయ పార్టీపై వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సెటైర్లు వేశారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగులు చనిపోతుంటే ఆదుకోని కేసీఆర్.. ఢిల్లీకి వెళ్లి ఏం చేస్తారని ప్రశ్నించారు. మెదక్ జిల్లాలో పాదయాత్ర సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గంలో ప్రసంగించిన షర్మిల.. ముఖ్యమంత్రి పై సెటైర్లు వేశారు. బంగారు తెలంగాణ ఎవరికి అయ్యిందని ఆమె నిలదీశారు.

”ఉన్న దరిద్రం చాలదన్నట్టు ఇప్పుడు కేసీఆర్ దేశంపై పడతారట. అమ్మకు అన్నం పెట్టలేనోడు పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాడట. ప్రజాసమస్యలను, రైతులను కేసీఆర్ పట్టించుకోవడం లేదు. తెలంగాణలో ఏ వర్గాన్ని అయినా కేసీఆర్ ఆదుకున్నారా? అని షర్మిల ప్రశ్నించారు. షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర 169వ రోజు కొనసాగింది. ఆందోల్ నియోజకవర్గం చింతకుంటలో ప్రారంభమై చండూర్, చిట్కూల్ మీదుగా సాగింది.

కేసీఆర్, కేటీఆర్ లకు షర్మిల ఓ సవాల్ కూడా విసిరారు. తనతో ఒక్కరోజు పాదయాత్రకు వస్తే రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయని నిరూపిస్తానన్నారు. నిరూపించకపోతే ముక్కు నేలకు రాస్తానన్న షర్మిల.. ఒకవేళ నిరూపిస్తే మీరు రాజీనామా చేస్తారా? అని కేసీఆర్, కేటీఆర్ లకు సవాల్ విసిరారు షర్మిల. రాష్ట్రంలో సమస్యలు ఉన్నాయని నిరూపిస్తే రాజీనామా చేసి దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తారా? అని ప్రశ్నించారు. మీ పాలనపై మీకు నమ్మకం ఉంటే తన సవాల్ ని స్వీకరించాలన్నారు వైఎస్ షర్మిల.

”మీ పాలన అద్భుతం అని మీరంటున్నారు. నిజంగానే మీ పాలన అద్భుతం అని మీకు నమ్మకం ఉంటే ఒక్కరోజు నాతో కలిసి పాదయాత్ర చేయండి. ఎన్ని సమస్యలు ఉన్నాయో నేను మీకు చూపిస్తా. నిజంగానే సమస్యలు లేకపోతే నా ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి నా ఇంటికి వెళ్లిపోతా. కానీ, నిజంగానే ప్రజలకు సమస్యలుంటే మాత్రం మీ ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పి పదవులకు రాజీనామా చేసి ఒక దళితుడిని ముఖ్యమంత్రిని చేయాలి. దమ్ముంటే ఈ సవాల్ ని స్వీకరించాలి కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ. నిజంగానే మీ పాలన మీద మీకు నమ్మకం ఉంటే.. నా ఛాలెంజ్ ని స్వీకరించండి. ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు అవార్డులు తీసుకుంటున్నారు. అసలు అవార్డులు ఇవ్వాల్సింది ప్రజలు కదా” అని షర్మిల అన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

కాగా, తెలంగాణ సీఎం కేసీఆర్ త్వరలో జాతీయ పార్టీని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. జాతీయ పార్టీ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైంది. దసరా రోజే కొత్త పార్టీని స్థాపించబోతున్నారు. ఈ పార్టీకి ‘భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)’ అని నామకరణం చేయనున్నారు. అనేక పేర్లు పరిశీలించిన తర్వాత బీఆర్ఎస్ వైపే కేసీఆర్ మొగ్గుచూపినట్లు సమాచారం.

పార్టీ స్థాపనకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. దసరా రోజు మధ్యాహ్నం 1.19 నిమిషాలకు కేసీఆర్ పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. అదే రోజు ఢిల్లీలో తాత్కాలిక పార్టీ ఆఫీసు కూడా ప్రారంభమవుతుంది. ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో బీఆర్ఎస్ ఆఫీసు సిద్ధమవుతోంది. పార్టీ ఏర్పాటు కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు మంత్రి కేటీఆర్ రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా జాతీయ కో-ఆర్డినేటర్ల నియామకంపై కూడా కసరత్తు చేస్తున్నారు. పార్టీ ఏర్పాటు కార్యక్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన మాజీ సీఎంలు కుమారస్వామి, శంకర్ సింగ్ వాఘేలా, నటుడు ప్రకాశ్ రాజ్ పాల్గొంటారు. ప్రకాశ్ రాజ్‌కు దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేషన్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.