ఏపీలో మూడు రాజధానుల రాజకీయం!

  • Published By: sreehari ,Published On : January 15, 2020 / 12:46 PM IST
ఏపీలో మూడు రాజధానుల రాజకీయం!

Updated On : January 15, 2020 / 12:46 PM IST

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన నాటి నుంచి రాష్ట్రంలో రాజకీయాల స్వరూపం మారిపోయింది. మూడు రాజధానుల వెనుక అన్ని పార్టీలు తమ తమ ప్రయోజనాలను వెతుక్కుంటున్నాయి. ప్రజల ఆకాంక్షల సంగతేమోగానీ ఆయా పార్టీలకు ఒనగూరే ఉపయోగం ఏమిటన్న దానిపైనే ఫోకస్‌ పెడుతున్నాయి. ఈ ప్రతిపాదన వెనుక సహజంగానే అధికార వైసీపీ తన ప్రయోజనాలను చూసుకుంటుంది. జగన్ వేసిన ఎత్తుకు బలికాకుండా ఇతర పార్టీలు జాగ్రత్త పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రకరకాల వ్యూహాలను వేస్తూ ప్రజలతో గేమ్స్‌ ఆడుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ వంటి పార్టీలు ఇప్పుడు ఇదే పనిలో ఉన్నాయి.

డబుల్ గేమ్.. ప్రజల్లో అసహనం :
రాజకీయ పార్టీల రాష్ట్ర నేతలంతా రాజధానుల మార్పు, విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ హోదాను దాదాపుగా వ్యతిరేకిస్తున్నారు. అమరావతిలో సాగుతోన్న ఉద్యమాలకు మద్దతు కూడా ఇస్తున్నారు. అదే పార్టీకి చెందిన విశాఖ జిల్లా నేతలు మాత్రం అధిష్టానం వైఖరికి వ్యతిరేకంగా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధాని చేయాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీలు అమరావతిలో ఒకలా, విశాఖలో మరోలా వ్యవహరిస్తున్నాయి. పార్టీలు ఆడుతున్న ఈ డబుల్ గేమ్‌ను చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ఎవరి ఓటు బ్యాంక్ రాజకీయాలు వారివి అని ప్రజలే సరిపెట్టుకుంటున్నారు.

ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ మూడు రాజధానుల వ్యవహారంలో చేస్తున్న రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఒక రాష్ట్రం-ఒక రాజధాని అంటూ ఉద్యమం చేస్తున్నారు. ఆయన పార్టికి చెందిన విశాఖ జిల్లా నేతలు మాత్రం విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేయాలన్న సీఎం జగన్‌ నిర్ణయం మంచిదేనని, ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఓ తీర్మానం కూడా చేసేశారు.

ఇదంతా గమనిస్తున్న ప్రజలు మాత్రం.. అదేంటి.. పార్టీ అధినేత వ్యతిరేకించడమేమిటి.. విశాఖ తెలుగు తమ్ముళ్లు మాత్రం స్వాగతించడం ఏమిటి? ఇదంతా రాజకీయమేనని అంటున్నారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశాఖ రాజధాని ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉత్తరాంధ్ర అంతటా దెబ్బ తినే ప్రమాదం ఉందని గ్రహించే తెలుగుదేశం పార్టీ ఈ గేమ్ ఆడుతోందని భావిస్తున్నారు.

క్రెడిట్ వైసీపీకి వెళ్తుందని :
ఇక భారతీయ జనతా పార్టీ విషయానికొద్దాం.. రాజధాని చుట్టూ సాగుతోన్న డబుల్ గేమ్‌కు బీజేపీ కూడా అతీతం కాదు. అమరావతి మార్పుపై బీజేపీ ఇప్పటి వరకు స్పష్టమైన వైఖరిని వెల్లడించలేదు. కానీ తెలుగుదేశం దారిలోనే అడుగులు వేస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి రైతులకు మద్దతుగా దీక్షలు చేశారు. అధికార వికేంద్రీకరణకు తమ పార్టీ అనుకూలమంటున్నారు.

కానీ, రైతులకు న్యాయం చేయాలంటూ మరో మాట చెబుతారు. విశాఖ బీజేపీ నేతలు మాత్రం విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిని స్వాగతిస్తూనే సీఎం చేసిన ప్రతిపాదనలపై మాత్రం విరుచుకుపడుతున్నారు.ఎగ్జిక్యూటివ్ రాజధానిని వ్యతిరేకిస్తే స్థానికంగా ప్రజలకు దూరమవుతామనే భయం కమలనాథులను వెన్నాడుతోందట. పోనీ సీఎం నిర్ణయానికి పూర్తి మద్దతు ప్రకటిద్దామంటే క్రెడిట్ మొత్తం వైసీపీకే వెళ్లిపోయే ప్రమాదం ఉందని అనుకుంటున్నారు. అందుకే అటుఇటు కాని వ్యూహాన్ని అనుసరిస్తోందట బీజేపీ.

జనసేన అజెండా ఇదే :
జనసేన పరిస్థితి కూడా మిగతా పార్టీలకు విభిన్నంగా ఏమీ లేదు. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మూడు రాజధానులపై మండిపడుతున్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వ్యతిరేకించడం గానీ, స్వాగతించడం గానీ ఆ పార్టీ నేతలు చేయడం లేదు. అమరావతి రైతులకు న్యాయం చేయాలన్నదే జనసేన అజెండాగా కనిపిస్తోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ను స్వాగతిస్తే మిగతా ప్రాంతాల్లో నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పవన్ అభిమాన వర్గాల్లో కూడా చీలిక వచ్చే ప్రమాదం ఉందని గ్రహించారు. అందుకే రాజధానుల వ్యవహారం కాకుండా అమరావతి రైతులకు అన్యాయం చేయకూడదన్న పాయింట్‌ మీదే జనసేన ఉద్యమం సాగిస్తోంది.

విజేత ఎవరో :
అధికార వైసీపీ మాత్రం మూడు రాజధానుల వ్యవహారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రతిపాదించిన తర్వాత తొలిసారిగా విశాఖ వచ్చిన సందర్భంగా 24 కిలోమీటర్ల దూరం పాటు మానవహారం స్వాగతంతో పులకించిపోయారు జగన్. అక్కడితో ఆగకుండా విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధానిని స్వాగతిస్తూ అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహిస్తున్నారు.

మూడు రాజధానుల్లోనూ వైసీపీ అదే తరహా పొలిటికల్ గేమ్‌ను రన్ చేస్తోంది. రకరకాల మార్గాల్లో మూడు రాజధానుల ప్రతిపాదనలపై వ్యతిరేకత వస్తున్నా సరే పట్టించుకోకుండా తీసుకున్న నిర్ణయం దిశగా కట్టుబడి ముందుకెళుతోంది. మొత్తం మీద ఈ మూడు రాజధానుల పొలిటికల్‌ గేమ్‌లో విజేతగా నిలిచేదెవరో తెలియాలంటే స్థానిక సంస్థల ఎన్నికల వరకూ ఆగాల్సిందేనంటున్నారు జనాలు.