రెండో రోజు ప్లాన్ ఫెయిల్: బోటు లాగుతుండగా విరిగిన యాంకర్

  • Published By: vamsi ,Published On : October 1, 2019 / 01:35 PM IST
రెండో రోజు ప్లాన్ ఫెయిల్: బోటు లాగుతుండగా విరిగిన యాంకర్

Updated On : October 1, 2019 / 1:35 PM IST

కచ్చులూరు దగ్గర రెండో రోజు బోటు వెలికితీత పనులు విఫలం అయ్యాయి. మూడు యాంకర్లు వేసి ఐరన్‌ రోప్‌తో లాగేందుకు ప్రయత్నాలు చేయగా.. నిన్న వేసిన రోప్‌‌కు బోటు పట్టు దొరికినట్టు అంచనా వేసింది ధర్మాడి సత్యం బృందం. అయితే ఏదో బలమైనది బయటకు వస్తుందని భావించిన బృందానికి నిరాశే ఎదురైంది. బోటు కోసం వేసిన యాంకర్ విరిగిపోయింది.

ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోగా.. గోదావరి వరద, తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాల కారణంగా బోటు వెలికితీత చర్యలు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం గోదావరిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టగా ప్రభుత్వం బోటును బయటకు తీసేందుకు చర్యలు చేపట్టింది.

ఈ క్రమంలోనే కాకినాడకు చెందిన బోటు నిపుణుడు ధర్మాడి సత్యంకి చెందిన బాలాజీ మెరైన్స్‌ సంస్థ బోటును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇనుప రోప్‌లు, పెద్ద తాళ్లు, క్రేన్లు, రివర్స్ పంట్లు, పొక్లెయినర్లతో ధర్మాడి సత్యం బృందం బోటును బయటకు తీసేందుకు ప్రయత్నించింది. బోటు మునిగిన కచ్చులూరు మందం ప్రాంతానికి లాంచీలలో చేరుకుని రోప్‌లకు యాంకర్లు తగిలించి నీటిలో జారవిడిచారు. అయితే ఒక యాంకర్ విరిగిపోవడంతో ప్లాన్ ఫెయిల్ అయ్యింది.

బోటు మునిగిన ప్రాంతంలో మొత్తం ఐదు యాంకర్లు వేయగా బలమైన వస్తువు తగిలింది. అది మునిగిపోయిన రాయల్ వశిష్ట బోటు అని అందరూ భావించారు. ఆ యాంకర్‌ రోప్‌ను పొక్లెయిన్ సాయంతో నెమ్మదిగా బయటికి లాగుతున్న సమయంలో విరిగిపోయింది. మరోవైపు తమవారి కోసం కుటుంబ సభ్యులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.