YSRCP: ఏపీలో వైఎస్సార్‌సీపీకి మరో ఎదురుదెబ్బ.. ఏం జరిగింది?
వైసీపీ ఓడిపోవడంతో ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లన్నీ కూటమి పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయాయి.

ఏపీలో ఫ్యాన్ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయా? సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత ఆపార్టీకి అన్నీ అపజయాలే ఎదురవుతున్నాయా? రాష్ట్రంలో కూటమి దెబ్బకు వైసీపీ కుదేలవుతోందా? సైకిల్ స్పీడ్ కి వైసీపీ మున్సిపల్ పీఠాలన్నీ ఒక్కొక్కటిగా కదిలిపోతున్నాయా? అంటే అవుననే సమాధానం ఏపీ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది. ఇప్పటికే మెజార్టీ కార్పొరేషన్లను దక్కించుకున్న కూటమి..అంటు మున్సిపాల్టీలను కూడా తన ఖాతాలో వేసుకుంటోంది. దీంతో ఏపీలో వైసీపీ మున్సిపాలిటీలు ఖాళీ కాబోతున్నాయా చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ఊపందుకుంది.
ఏపీలో వైసీపీకి వరుసగా అన్నీ ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఫ్యాన్ పార్టీకి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయన్న టాక్ విన్పిస్తోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీకి ఇప్పటికే చాలా మంది సీనియర్లు గుడ్ బై చెప్పారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు..ఇలా వరుసపెట్టి నేతలు కూటమి పార్టీల్లోకి క్యూ కట్టారు. మరికొంతమంది కూడా పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారట.
ఇలా పార్టీ నుంచి నేతలంతా జారుకుంటుంటే అటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను సైతం కూటమి దక్కించుకుంటుంది. ఇప్పటికే మెజార్టీ కార్పొరేషన్లను దక్కించుకున్న కూటమి…తాజాగా మున్సిపాలిటీలను కూడా తన ఖాతాలో వేసుకుంటూ వైసీపీకి వరుస షాకులిస్తోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఆపార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగుతున్నాయి. మున్సిపాలిటీలు చేజారకుండా వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా..సైకిల్ దెబ్బకు ఆపార్టీ మున్సిపాలిటీలన్నీ కూటమి వశం అవుతున్నాయి.
Also Read: ఆ పోలీస్ అధికారికి స్వామి భక్తి రివర్స్ అయిందా?
ఇప్పటికే మెజార్టీ మున్సిపాలిటీలను తన ఖాతాలో వేసుకున్న కూటమి..తాజాగా కదిరి మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. ఛైర్‌పర్సన్‌గా దిల్షా దున్నీషా ఎన్నికకాగా..వైస్ చైర్మన్లుగా సుధారాణి, రాజశేఖర్ ఆచారి సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికను వైసీపీ బహిష్కరించింది. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉండగా..వైసీపీకి చెందిన 11 మంది కౌన్సిలర్లు గైర్హైజరయ్యారు. దీంతో 25 మంది మద్దతులో దిల్ షాదున్నీసా చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. గాండ్లపేట ఎంపీపీగా గజ్జెల సోముశేఖర్ రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మొత్తం ఏడుగురు ఎంపీటీసీల్లో నలుగురు టీడీపీ సభ్యులు హాజరుకాగా…ముగ్గురు వైసీపీ సభ్యులు రాలేదు.
ఇదిలా ఉంటే మరోవైపు విజయనగరం జిల్లా బొబ్బలి మున్సిపల్ ఛైర్మన్‌గా టీడీపీకి చెందిన శరత్‌బాబు ఎన్నికయ్యారు. గత నెల 29న ఛైర్మన్ మురళీకృష్ణారావుపై అవిశ్వాసం ప్రవేశపెట్టగా..అవిశ్వాస ఓటింగ్‌లో టీడీపీ గెలిచింది. దీంతో మురళీకృష్ణారావు ఛైర్మన్ పదవి కోల్పోయారు. మొత్తం 20 మంది సభ్యుల మద్దతుతో బొబ్బిలి మున్సిపాలిటీ కూటమి ఖాతాలోకి చేరింది.
వాయిదాల పర్వం
ఇక తిరువూరు నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక వాయిదాపడింది..కోరం లేకపోవడంతో వచ్చే మంగళవారానికి ఎన్నికను వాయిదా వేశారు. మొత్తం 20 మందికి గాను ఏడుగురు మాత్రమే హాజరుకావడంతో వాయిదా వేస్తూ ఎన్నికల అధికారి నిర్ణయం తీసుకున్నారు. అలాగే శ్రీసత్యసాయిజిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నిక మూడోసారి వాయిదా పడింది. వైసీపీ ఎంపీటీసీ సభ్యులు సమావేశానికి గైర్హాజరుకావడంతో ఎన్నిక వాయిదా పడింది. గతంలో కోరంలేక ఎంపీపీ ఎన్నిక రెండుసార్లు వాయిదా పడింది.
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆపార్టీ మున్సిపల్ పీఠాలను దాదాపుగా దక్కించుకుంది. అయితే వీటిని ఫ్యాన్ పార్టీ నుంచి లాగేసుకునేందుకు కూటమి విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తొలుత ఈ ప్రయత్నాలన్నీ విఫలమైనా…ప్రస్తుతం వైసీపీ మున్సిపాలిటీలన్నీ కూటమి ఖాతాలో వచ్చి పడుతున్నాయి. ఆయా కార్పొరేషన్లలో సైతం విపక్ష పార్టీ పని అయిపోయిందన్న టాక్ ఏపీ రాజకీయవర్గాల్లో విన్పిస్తోంది.
ఫ్యాన్ పార్టీ పాగా వేసిన కీలక స్థానాలన్నింటిని కూటమి కూకటివేళ్లతో సహా పెకిలిస్తోంది. వైసీపీ కంచుకోటలను ఆ మూడు పార్టీలు బద్దలు కొడుతుండడంతో ఏపీలో ఇప్పటికే మెజార్టీ మేయర్ పీఠాలన్నీ కూటమి ఖాతాలోకి వెళ్లాయి. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు ఎలాంటి అధికారాలు లేకుండా చేశారని ఆ పార్టీ కార్పొరేటర్లు అంటున్నారట. ఆయా మున్పిపాలిటీల్లో ఛైర్మన్లు, కార్పొరేషన్లలో మేయర్లు వైసీపీకి అనుకూలంగా పనిచేశారే తప్ప ప్రజాప్రతినిధులుగా పనిచేయలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
వైసీపీ అధికారం కోల్పోవడంతో వైసీపీ మేయర్లంతా ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారట. అప్పటికే అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను కూటమి పార్టీలు ఆహ్వానించాయి. దీంతో ఎవరి అవసరం కోసం వారు ఆయా పార్టీల్లో చేరిపోయారు. మెజార్టీ పెరిగిన కూటమి పార్టీలు ఆయా కార్పొరేషన్లలో మేయర్లపై అవిశ్వాసం పెట్టించారు.
వైసీపీ ఓడిపోవడంతో ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లన్నీ కూటమి పార్టీల చేతుల్లోకి వెళ్లిపోయాయి. మొత్తానికి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోవడంతో ఏ జిల్లాలోనూ కనీస మెజార్టీ లేకపోవడంతో కూటమికి అన్ని విధాలుగా పైచేయి లభించినట్లు అయిందన్న టాక్ విన్పిస్తోంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే రహదారులు, మంచినీటి సమస్య, డ్రైనేజి ఇతర మౌలిక సదుపాయాలు వంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే ప్రయత్నం చేయడంతో ప్రజల్లో సానుకూలత పెరిగిందని టాక్.