రాజధానికి బాబు : సమాధానం చెప్పాకే పర్యటించాలి – రైతులు

తమకు సమాధానం చెప్పాకే రాజధాని ప్రాంతంలో పర్యటించాలని అంటున్నారు అక్కడి రైతులు. నవంబర్ 28వ తేదీ గురువారం పర్యటించాలని బాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ పర్యటనపై పలువురు రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఇచ్చిన హామీలపై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. రాజధాని ప్రాంతం కోసం గత ప్రభుత్వానికి 300 ఎకరాలు ఇవ్వడం జరిగిందనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తాము మోసపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు సమాధానం చెప్పిన తర్వాత పర్యటించాలని వారు సూచిస్తుండడంతో ఉత్కంఠ నెలకొంది.
ప్రభుత్వం మారిన తర్వాత రాజధాని ప్రాంతంలో బాబు పర్యటించాలని అనుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని నిర్మాణ పనులు, ఇతర పనుల పురోగతిని పరిశీలించేందుకు బాబు అక్కడకు వెళ్లనున్నారు. రాజధాని గ్రామాల్లో కూడా పర్యటిస్తారని టీడీపీ నేతలు వెల్లడిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధాని ప్రాంతంపై వివాదం నడుస్తోంది. మంత్రి బోత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వేడి పుట్టించాయి. భూముల విషయంలో అక్రమాలు జరిగాయంటూ..వైసీపీకి చెందిన కొందరు లీడర్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై వైసీపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ. గత ప్రభుత్వ హాయాంలో రాజధాని నిర్మాణం కోసం భారీగా భూ సేకరణ జరిగింది. సింగపూర్, జపాన్‌ల నుంచి పలువురు నిపుణులను రప్పించి అనేక డిజైన్లను రూపకల్పన చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ క్యాపిటల్ ప్రాంతంలో సింగపూర్ ప్రాజెక్టును సైతం సీఎం జగన్ రద్దు చేశారు. దీంతో రాజధాని ప్రాంతం మారిపోతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దానికి తోడు అమరావతి విషయంలో వైసీపీ..రాజధాని కమిటీ వేసింది. ఈ కమిటీ పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజాభిప్రాయసేకరణ చేస్తోంది. తాత్కలిక నిర్మాణాలు, చిన్న వర్షానికే మడుగులు కట్టేయడంపై పలు విమర్శలు చెలరేగాయి. శాశ్వత హైకోర్టు తమ ప్రాంతంలోనే నిర్మించాలని సీమ ప్రాంతం నుంచి డిమాండ్లు వస్తున్నాయి. తాజాగా బాబు పర్యటనపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవిస్తాయో వేచి చూడాలి.
Read More : మహిళా ఎమ్మెల్యే బుగ్గ గిల్లి ముద్దు పెట్టుకున్న పిల్లాడు..వీడియో