రాజధాని కోసం : నిపుణుల కమిటీ రిపోర్ట్ రెడీ..నివేదికలో ఏముందో

ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని రగడ కొనసాగుతున్న వేళ.. ప్రభుత్వంపై ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ 2019, డిసెంబర్ 20వ తేదీ శుక్రవారం సీఎం జగన్‌ను కలువనుంది. రాజధానిపై ఏపీ ప్రజల అభిప్రాయాలు సేకరించి నిపుణుల కమిటీ ఇప్పటికే మధ్యంతర నివేదికను సీఎం జగన్‌కు ఇచ్చింది. 2019 సెప్టెంబర్ 13న రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని నగరాల అభివృద్ధి స్థితి గతులను పరిశీలించేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్‌రావు నేతృత్వంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది.
పర్యావరణం, విపత్తుల సమస్యలు నగరాలకు ఏ మాత్రం ఉన్నాయి అన్న విషయాలను కూలంకుశంగా ఈ కమిటీ పరిశీలన చేసింది. ఆరు నెలల్లో కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయాల్సి వుంది. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగియడంతో శుక్రవారం సాయంత్రం కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందజేయనుంది. రాష్ట్రానికి ఎగ్జిక్యూటీవ్ కేపిటల్, జుడీషియల్ కేపిటల్, లెజిస్లేటివ్ కేపిటల్‌గా మూడు రాజధానుల అవసరం ఉందని శాసనసభలో సీఎం జగన్ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తోంది.
మరి జిఎన్ రావు కమిటీ తన నివేదికలో ఏం చెప్పనుందనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ కమిటీని రద్దు చేయాలని రాజధాని రైతుల పరిరక్షణ సమితి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..జిఎన్ రావు నిఫుణులు కమిటి ఇచ్చే నివేదిక ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి స్థాయి రిపోర్టులో రాజధానిపై ఏం చెప్పబోతోంది? అన్ని ప్రాంతాల అభివృద్దికి ఏలాంటి సూచనలు చేయనుందనేది ఆసక్తి రేపుతోంది.
కమిటీ రిపోర్టుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఏపీకి మూడు రాజధానులు అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ప్రాంత రైతుల్లో మాత్రం తీవ్ర ఆందోళన నెలకొంది. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు. మరి నిపుణుల కమిటీ అందజేసే నివేదికపై సీఎం జగన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
Read More : ఉపాధి హామీ పథకం అమలులో దేశంలోనే ఏపీ అగ్రస్థానం