Chandrababu Naidu: కుప్పంకు ముఖ్యమంత్రి చంద్రబాబు.. మూడు రోజులు అక్కడే.. పూర్తి వివరాలు ఇలా..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు నియోజకవర్గంలో పర్యటించనున్నారు.

Chandrababu Naidu
CM Chandrababu Naidu Kuppam Tour: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. రేపు (సోమవారం) కుప్పంకు చేరుకోనున్న ఆయన.. మూడు రోజులు నియోజకవర్గంలోనే ఉంటారు. ‘స్వర్ణ కుప్పం’ పథకం పేరిట నియోజకవర్గం రూపురేఖలను మార్చేందుకు చంద్రబాబు నాయుడు స్పెషల్ ఫోకస్ పెట్టారు. వచ్చే ఐదేళ్లలో కుప్పం ప్రాంతం సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ‘స్వర్ణ కుప్పం -విజన్ 2029’ పథకంకు శ్రీకారం చుట్టనున్నారు.
Also Read: Pawan Kalyan : ఏపీలో ఫిలిం స్కూల్స్ పెట్టండి.. స్టూడియోలు కట్టండి.. ఏపీని చిన్నచూపు చూడొద్దు..
సోమవారం కుప్పంకు చేరుకోనున్న చంద్రబాబు నాయుడు.. స్వర్ణ కుప్పం విజన్ 2029ని ఆవిష్కరిస్తారు. కుప్పం ప్రాంత సమగ్రాభివృద్ధికి ఇప్పటికే 17 అంశాలకు సంబంధించి ప్రణాళికలను అధికారుల బృందం సిద్ధం చేసింది. కుప్పం నియోజకవర్గంలో సుమారు 1500 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టనున్నారు. రూ. వెయ్యి కోట్లతో కుప్పం నియోజకవర్గం పరిధిలోని 50వేలకు పైచిలుకు ఇళ్లకు సోలార్ విద్యుత్ ను అందించనున్నారు. కుప్పం నియోజకవర్గంను అభివృద్ధిలో రాష్ట్రానికే ఆదర్శంగా తీర్చిదిద్దమే స్వర్ణ కుప్పం ప్రధాన లక్ష్యమని నియోజకవర్గంలోని కూటమి నేతలు పేర్కొంటున్నారు.
ప్రజల జీవన ప్రమాణాల పెరుగుదల, కుప్పం ప్రాంత సమగ్ర అభివృద్ధి పథకం ప్రధాన ఉద్దేశం. కుప్పం ప్రాంతంలో సుమారు మూడు లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు. పాడి పరిశ్రమ అభివృద్ధికి కుప్పంకు మరో రెండు కొత్త డైరీలు అందుబాటులోకి రానున్నాయి. 1250 ఎకరాల్లో కుప్పం విమానాశ్రయం ఏర్పాటుకోసం తొలిదశలో 483 ఎకరాలను రన్‌వే కోసం.. రెండోదశలో 567 ఎకరాలను భవన నిర్మాణాలకోసం అధికారులు సిద్ధం చేసేపనిలో నిమగ్నమయ్యారు.