Ys Sharmila : జనసేన పార్టీకి కొత్త పేరు పెట్టిన వైఎస్ షర్మిల.. ఇప్పటికైనా మేల్కోవాలని పవన్ కల్యాణ్ కు విన్నపం..
సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండటం విచారకరం.

Ys Sharmila : జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హిందీ భాష వద్దు అంటే ఎలా? దేశానికి బహుళ భాషలు అవసరం అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో స్పందించారు. పవన్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. ఇక, తాజాగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల పవన్ కల్యాణ్ పై విరుచుకుపడ్డారు. మత పిచ్చి బీజేపీ ఆశయాలను పవన్ కల్యాణ్ అలవరుచుకోవడం దురదృష్టకరం అన్నారు.
అంతేకాదు.. జనసేనకు ఆమె కొత్త పేరు పెట్టారు. జనసేన పార్టీని పవన్ కల్యాణ్ ఆంధ్ర మతసేనగా మార్చారని షర్మిల మండిపడ్డారు. ఇప్పటికైనా పవన్ మేల్కోవాలని, బీజేపీ మైకం నుంచి బయటపడాలని పిలుపునిచ్చారు షర్మిల. ఈ మేరకు సోషల్ మీడియాలో పవన్ ను విమర్శిస్తూ షర్మిల చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
Also Read : ఆప్తులు కాస్త ప్రత్యర్థులుగా మారి జగన్‌పై బాణాలు.. వైసీపీ అధినేత టార్గెట్‌గా ఆ ఇద్దరి విమర్శల దాడి..
”పవన్ కల్యాణ్.. చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేశారు. ఇప్పుడు ఆయన మోడీ, అమిత్ షా సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారు. RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారు. జనసేన పార్టీని “ఆంధ్ర మతసేనా” పార్టీగా మార్చారు. జనం కోసం పుట్టిన పార్టీ అని చెప్పి ఒక మతానికి అజెండాగా మార్చడం దారుణం.
సర్వమత సమ్మేళనంగా విరాజిల్లుతున్న ఆంధ్ర రాష్ట్రంలో విభజించు పాలించు అన్నట్లుగా మీ వైఖరి ఉండటం విచారకరం. పార్టీ పెట్టి 11 ఏళ్లు పోరాడి, ఉప ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టి, మతం రంగు పూసుకుని, ఒకరి ప్రయోజనాలే లక్ష్యం అన్నట్లుగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ పార్టీగా ఖండిస్తున్నాం. స్వాతంత్య్ర సమరయోధుల ఆశయాలతో పుట్టిన పార్టీ అని చెప్పి, మత పిచ్చి బీజేపీ ఆశయాలను అలవరుచుకోవడం దురదృష్టకరం. ఉప ముఖ్యమంత్రి పవన్ ఇప్పటికైనా మేల్కోండి. బీజేపీ మైకం నుంచి బయట పడండి” అని విజ్ఞప్తి చేశారు షర్మిల.
జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ స్పీచ్ పై సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ ప్రసంగం విచిత్రంగా ఉందన్నారు. గతంలో చేగువేరా పేరు చెప్పి ఓట్లు వేయించుకున్నారు.. ఇప్పుడు చేగువేరా డాక్టర్ అని చెబుతున్నారంటూ బీవీ రాఘవులు విమర్శించారు. చేగువేరా ఎప్పుడు వైద్యం చేశారో మాకు తెలియదన్నారు.
జనసేన @JanaSenaParty అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి @PawanKalyan పవన్ కళ్యాణ్ గారు చేగువేరా, గద్దర్ అన్న సిద్ధాంతాలకు నీళ్ళొదిలేశారు. ఇప్పుడు ఆయన @narendramodi మోడీ, అమిత్ షా @AmitShah సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకున్నారు. RSS భావజాలాన్ని నరనరాన జీర్ణించుకున్నారు. జనసేనా పార్టీని…
— YS Sharmila (@realyssharmila) March 16, 2025