ఏపీలో కౌంటింగ్‌కు సర్వంసిద్దం.. 33 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మరికొద్ది గంటల్లో ఏపీలోని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

ఏపీలో కౌంటింగ్‌కు సర్వంసిద్దం.. 33 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు

Counting

Updated On : June 3, 2024 / 10:00 AM IST

AP Election Counting : ఏపీ ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయం రానేవచ్చింది. మరికొద్ది గంటల్లో ఏపీలోని అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 33 కేంద్రాల్లో కౌంటింగ్ జరగనుంది. కౌంటింగ్ కు అవాంతరాలు కలిగించేందుకు ప్రయత్నించే వారిని నిర్థాక్షణ్యంగా బయటకు పంపడమే కాకుండా చట్టపరంగా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నిజిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. కౌంటింగ్ రోజు, తరువాత రోజుల్లో శాంతి భద్రతలు అదుపులో ఉండేలా, ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతవాతావరణంలో పూర్తయ్యేలా ముందస్తు జాగ్రత్తలుపై అధికారుల దృష్టి కేంద్రీకరించారు.

Also Read : గతంలో ఎన్నడూలేని విధంగా ఈసారి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి: బుద్దా వెంకన్న

తొలుత పోస్టల్ బ్యాలెట్, ఆ తరువాత ఈవీఎంల కౌంటింగ్ జరుగుతుంది. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక ఏజంట్ ను నియమించుకునేందుకు, ఆర్వో టేబుల్ వద్ద అభ్యర్థి లేనప్పుడు మాత్రమే ఒక ఏజంట్ కు అవకాశం ఉంటుంది. కౌంటింగ్ కేంద్రంలోకి వచ్చే ఏజంట్ చేతిలో ఫారం-17సి, పెన్ను లేదా పెన్సిల్, ప్లైయిన్ పేపర్ మాత్రమే ఉండేలా చూడాలని ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది. ఓట్ల లెక్కింపు కేంద్రాలన్నీ ఫైర్ సేఫ్టీ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని, అందుకు తగ్గట్టుగా అగ్నిమాపక శాఖ నుండి దృవీకరణ పత్రాన్ని తప్పని సరిగా పొందాలని ఈసీ సూచించింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనుంది.

Also Read : అందుకే ఎగ్జిట్ పోల్స్‌లో వైసీపీకి తక్కువ సీట్లు వస్తున్నట్లు ఇచ్చారు: సజ్జల

తెలంగాణలో ..
తెలంగాణలోనూ లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంకు ఉప ఎన్నిక జరిగింది. ఇందుకు సంబంధించి ఓట్ల లెక్కింపునకు మొత్తం 34 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రేపు ఉదయం 8 గంటలకు మొదటి పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కించేందుకు 276 టేబుల్స్ ను ఏర్పాటు చేశారు. లోక్ సభ ఎన్నికల్లో 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు తరువాత ఈవీఎం ఓట్ల లెక్కింపును చేపట్టనున్నారు. ఇందుకోసం 120 కౌంటింగ్ హాల్స్, 1,855 టేబుల్స్ ఏర్పాటు చేశారు. మొత్తం 18 నుంచి 20 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. కౌంటింగ్ కోసం 14వేల మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12గంటల మధ్య తొలి ఫలితం వచ్చే అవకాశం ఉంది.