వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్.. పిటిషన్లు కొట్టివేత.. అరెస్టు
ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం, గొడవలు, సీఐపై దాడి, మహిళను దుర్భాషలాడిన కేసులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.

Pinnelli Ramakrishna Reddy
వైసీపీ నేత, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్స్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో ఆయనను నరసారావు పేటలో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం పిన్నెల్లిని ఎస్పీ కార్యాలయానికి తరలించారు. ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరుపున స్పెషల్ కౌన్సిల్ అశ్విన్ కుమార్ వాదనలు వినిపించారు. ఎన్నికల్లో ఈవీఎం ధ్వంసం, గొడవలు, సీఐపై దాడి, మహిళను దుర్భాషలాడిన కేసులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే.
కాగా, పిన్నెల్లి కేసులలో వాదనలు వినిపించేందుకు న్యాయవాది అశ్విన్ కుమార్‌ను ఏపీ సర్కారు స్పెషల్ కౌన్సిల్‌గా కొన్ని రోజుల క్రితమే నియమించింది. పోలింగ్ వేళ ఈవీఎంను ధ్వంసం చేయడం, అనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైనే హైకోర్టు విచారణ జరిపింది.
మే 13న జరిగిన పోలింగ్ రోజు ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లోనూ బాగా వైరల్ అయింది. అనంతరం ఆయన కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి మొత్తం నాలుగు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై ఈ నెల 20న హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇవాళ తీర్పు వచ్చింది. ఫిర్యాదుచేసిన నంబూరి శేషగిరిరావు తరఫున పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు.
Also Read: ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి