AP Weather Report : బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం, ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు. AP Weather Report

AP Weather Report
AP Rains : ఆంధప్రదేశ్ లో రానున్న 48 గంటలు మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడిందని వాతావరణ అధికారులు తెలిపారు. రానున్న 24 గంటల్లో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశముందన్నారు. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.
Also Read..AP Heavy Rains : ఏపీలో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు
వాయుగుండం ప్రభావంతో వర్షాలు కొనసాగుతాయి. ప్రకాశం, నంద్యాల, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలు, ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వానలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయన్నారు.
”అల్పపీడనం బలపడింది. తీవ్ర అల్పపీడనంగా కేంద్రీకృతమైంది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారే ఛాన్స్ ఉంది. అది క్రమేపీ వాయువ్య దిశగా ప్రయాణిస్తూ ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీర ప్రాంతం చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఇప్పటికే ఏపీలో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు నమోదయ్యాయి. పార్వతీపురం మన్యం జిల్లాలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రణస్థలంలో 7 సెంమీ, తిరువూరులో 6 సెంమీ, నూజివీడులో 6 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డ్ అయ్యింది. దీని ప్రభావం మూడు రోజుల పాటు రాష్ట్రంపై ఉంటుంది. రానున్న 48 గంటల్లో విస్తారంగా వానలు పడతాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం జిల్లాలోనూ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు పడే చాన్సుంది. రేపటి రోజున అల్లూరి సీతారామరాజు, ఎన్టీఆర్ జిల్లా, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కుండపోత వానలు పడే ఛాన్స్ ఉంది. రానున్న రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయి. గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే చాన్స్ ఉంది. రానున్న 4 రోజుల పాటు మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించాం” అని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారి తెలిపారు.