రాజధాని రైతులకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

bail for rajadhani farmers: రాజధాని రైతులకు బెయిల్ మంజూరైంది. ఆరుగురు రైతులకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులు గుంటూరు జిల్లా జైలులో ఆరుగురు రైతులు ఉన్నారు. వారికి బేడీలు వేసి జైలుకి తీసుకెళ్లడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
అమరావతికి శంకుస్థాపన చేసి ఐదేళ్లైన అక్టోబర్ 22న రాజధాని రైతులు ఉద్ధండరాయునిపాలెం వరకు మహాపాద యాత్ర చేశారు. ఆ రోజున పోలీసులు కొందరు రైతులను అరెస్ట్ చేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి.. నిబంధనలకు విరుద్ధంగా బేడీలు వేసి.. జైలుకు తరలించారు. రైతులకు బేడీలు వేయడం వివాదానికి దారి తీసింది. ఈ ఘటనలో ఆరుగురు కానిస్టేబుళ్లను గుంటూరు ఎస్పీ విశాల్ గున్నీ సస్పెండ్ చేశారు. ఇద్దరు రిజర్వ్ ఎస్‌ఐలకు చార్జ్ మెమోలు జారీ చేశారు. నిందితులకు ఇలా బేడీలు వేయడం.. మానవ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుంది. దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయి. మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా రైతులకు బేడీలు వేయకూడదు. సుప్రీం కోర్టు ఆదేశాలను ధిక్కరించేలా పోలీసు చర్యలు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి.
రైతులకు బేడీలు వేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. జగన్ ప్రభుత్వంపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఇది కేడీల రాజ్యం అంటూ మండిపడ్డారు. అన్నదాతలను ప్రభుత్వం క్షోభకు గురి చేస్తోందంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ ఒక్క రైతు కుటుంబం సంతోషంగా లేదని చెప్పారు. రైతులకు బేడీలు వేసిన రాష్ట్రంగా అప్రదిష్టను జగన్ మూటగట్టుకున్నారని ఆరోపించారు. కేడీల రాజ్యంలో రైతులకు బేడీలా అనే అంశంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగేలా చేశారని అన్నారు. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల కాలంలో కన్నీళ్లు పెట్టని రైతు కుటుంబాలు లేవని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాత కుటుంబాలను ఎందుకింత క్షోభకు గురి చేస్తున్నారంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.