తిరుపతికి జేపీ నడ్డా.. మరోసారి పవన్ కళ్యాణ్

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారపర్వం వేడెక్కుతోంది. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం చేసేందుకు నేతలు తరలి వస్తున్నారు.

తిరుపతికి జేపీ నడ్డా.. మరోసారి పవన్ కళ్యాణ్

Bjp National Leader Jp Nadda To Campaign In Tirupati

Updated On : April 9, 2021 / 12:48 PM IST

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక ప్రచారపర్వం వేడెక్కుతోంది. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభ తరపున ప్రచారం చేసేందుకు నేతలు తరలి వస్తున్నారు. రత్నప్రభకు మద్దతుగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఇప్పటికే ప్రచారం చెయ్యగా.. మరోసారి తిరుపతికి పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. తిరుపతి ఉపఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అగ్రపార్టీలు ధీటుగా ప్రచారం చేస్తుండగా.. బీజేపీ కూడా జాతీయస్థాయిలో అగ్రనేతలను బరిలోకి దింపుతోంది.

ఈ క్రమంలోనే తిరుపతి ఉపఎన్నికల ప్రచారానికి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నారు. నడ్డా ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 14న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతిలో పర్యటించనున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా తిరుపతి ప్రచారానికి వెళ్లనున్నారు. ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుమల అలిపిరి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు ఇరుపార్టీల ముఖ్యనేతలు..

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హోరాహోరీ సాగుతున్నప్పటికీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తిరుపతి ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని నిర్ణయించినట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో నడ్డా తిరుపతికి రానుండగా.. మరికొంతమంది ముఖ్యనేతలు కూడా తిరుపతికి వచ్చే అవకాశం ఉంది.