డిప్యూటీ సీఎం వచ్చి వెళ్లిన వెంటనే ఇంకో మరణం సంభవించింది.. గుర్లలో డయేరియాపై బొత్స

డయేరియా మరణాలపై ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెబుతున్నారని, ఒక్క మరణం సంభవించినా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.

డిప్యూటీ సీఎం వచ్చి వెళ్లిన వెంటనే ఇంకో మరణం సంభవించింది.. గుర్లలో డయేరియాపై బొత్స

Botsa Satyanarayana

Updated On : October 21, 2024 / 6:01 PM IST

విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం కారణంగా పది మంది మృతి చెందిన ఘటనపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించారు. విజయనగరంలో బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అధికార యంత్రాంగంపై ప్రభుత్వానికి పట్టు లేదని చెప్పారు.

బహిరంగ మలవిసర్జన ద్వారా నీరు కలుషితమైందంటున్నారని, డిప్యూటీ సీఎం వచ్చి వెళ్లిన వెంటనే ఇంకో మరణం సంభవించిందని బొత్స సత్యనారాయణ చెప్పారు. పేద ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని, తాగునీరు సరఫరా సరిగ్గా పర్యవేక్షణ లేకే ఈ ఘటన జరిగిందని తెలిపారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యవేక్షణను పట్టించుకోవడం లేదని, నాలుగు నెలలుగా నిర్వహణ పనులు చేపట్టలేదని బొత్స సత్యనారాయణ చెప్పారు. డయేరియా మరణాలపై ఒక్కొక్కరు ఒక్కో లెక్క చెబుతున్నారని, ఒక్క మరణం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని అన్నారు.

ప్రభుత్వ పాలన తీరుపై సంక్రాంతి వరకు వేచి చూడాలనుకున్నామని బొత్స సత్యనారాయణ తెలిపారు. కాగా, జమిలి ఎన్నికలు వస్తున్నాయని చంద్రబాబే చెప్పారని, ప్రస్తుతం ఏపీలో పాలన గాడి తప్పడం వల్లే ప్రధాన ప్రతిపక్షంగా తాము స్పందించాల్సి వస్తోందని చెప్పారు.

విలాసవంతమైన భవనాలను ఏం చేస్తారు? రుషికొండ ప్యాలెస్‌ను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..