Tirupati Airport : తిరుపతి ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తిరుపతి ఎయిర్ పోర్టు ప్రైవేటీకరణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రైవేటీకరణ కానున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి ఎయిర్ పోర్టు కూడా ఒకటి. తిరుచ్చి ఎయిర్ పోర్టు పరిధిలోకి రానుంది.

Tirupati
privatization of Tirupati Airport : పెట్టుబడుల సమీకరణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నీరు నుంచి నింగిదాకా అన్నింటినీ కేంద్రం ప్రయివేటీకరిస్తోంది. రైల్వేల్లో వాటాలు వదులుకోవడానికి సిద్ధమైన కేంద్రం ఇప్పుడు విమానాశ్రయాలపై దృష్టిసారించింది. తిరుపతి విమానాశ్రయం ప్రైవేటీకరణకు కూడా కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ చేయనున్న 13 విమానాశ్రయాల్లో తిరుపతి విమానాశ్రయం కూడా ఒకటి. ఈ ఎయిర్ పోర్టును కూడా ప్రయివేట్ పరం చేసేందుకు పావులు కదుపుతోంది. తిరుమల శ్రీనివాసుడిని నిత్యం లక్షల మంది దర్శించుకుంటుంటారు. ఒక్క తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. ఇతర రాష్ట్రాలు, దేశ విదేశాల నుంచి కూడా భారీసంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. అధ్యాత్మిక కేంద్రంగా పేరొందిన తిరుపతిలోని విమానాశ్రయాన్ని ప్రైవేటీకరణ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తిరుపతి శ్రీనివాసుడిని దర్శించుకునేవారిలో చాలామంది రైలు ప్రయాణంతో పాటు విమాన ప్రయాణాలకు కూడా మెగ్గుచూపుతున్నారు. ఇటీవల విమానంలో తిరుపతికి చేరుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు నుంచి అతి తక్కువ సమయంలో తిరుపతి చేరుకోవచ్చు. సమయం కూడా చాలా ఆదా అవుతుంది. అందుకే చాలామంది ప్రయాణికుల ఈ విమాన ప్రయాణంపైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.
Tirupati : విలీనం కానున్న తిరుపతి ఎయిర్ పోర్టు!
సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి రైలు ప్రయాణం కొంచెం భారంగా అనిపిస్తోంది. తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకోవాలంటే వాయు మార్గమే చాలా సులభమమని భావిస్తున్నారు. సాధారణంగా విమాన ప్రయాణాన్ని ఎక్కువగా సంపన్నవర్గాలకు చెందిన వారే ప్రాధాన్యత ఇస్తుంటారు. కానీ, ఇటీవల పరిస్థితుల్లో సామాన్యులు కూడా తిరుపతికి విమానంలోనే ప్రయాణం చేస్తున్నారు. ఇంతగా ప్రసిద్ధిచెందిన తిరుపతి విమానాశ్రయాన్ని కేంద్రం ప్రయివేట్ పరం చేయాలనుకోవడంతో అందరిని షాకింగ్ గురిచేస్తోంది. త్వరలోనే తిరుపతి విమానశ్రయం నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఎయిర్ పోర్టును కూడా ప్రయివేట్ పరం చేయాలనుకోవడం హాట్ టాపిక్ గా మారింది. దేశంలో లాభాల్లో మేజర్ ఎయిర్‌పోర్టులతో కలిపి.. నష్టాల్లో ఉన్న మైనర్ ఎయిర్‌పోర్టులతో పాటు తిరుపతి ఎయిర్ పోర్టుకు ముడిపెట్టింది కేంద్రం. తిరుచ్చి ఎయిర్‌పోర్ట్‌తో తిరుపతి ఎయిర్‌పోర్ట్‌ను లింక్ చేసింది.
త్వరలో అంతర్జాతీయ సర్వీసులు.. అంతలోనే :
తిరుచ్చి ఎయిర్‌పోర్ట్ రూ.22 కోట్లకు పైగా లాభాల్లో ఉంది. తిరుపతి ఎయిర్‌పోర్ట్ రూ.35 కోట్ల నష్టాల్లో ఉంది. హైదరాబాద్, విశాఖ, విజయవాడ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే ఎయిర్ పోర్ట్ కూడా తిరుపతే. కొవిడ్ ప్రభావంతో ఏడాదిన్నరగా ప్రయాణికుల సంఖ్య కాస్త తగ్గింది. ప్రయాణికుల సంఖ్య తగ్గటం, విమానాల సర్వీసుల సంఖ్య తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ విమానాశ్రయాలను ప్రైవేటు పరం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. చిత్తూరు జిల్లా రేణిగుంటలోని ఈ విమానాశ్రయం ఆది నుంచి తిరుపతి విమానాశ్రయంగానే గుర్తింపు పొందింది. 1971లో తిరుపతి విమానాశ్రయానికి శంకుస్థాపన జరిగింది. అతి త్వరలో తిరుపతి విమానాశ్రయంలో ఇంటర్నేషనల్ సర్వీసులు ప్రారంభం అవుతాయని భావిస్తుండగా ఈలోగా ప్రైవేటుపరం నిర్ణయం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
2015లో అంతర్జాతీయ హోదా
1971లో తిరుపతి విమానాశ్రయంకు శంకుస్థాపన జరిగింది. అంచెలంచెలుగా తిరుపతి విమానాశ్రయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. నాటి ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో రూ.11 కోట్లతో కొత్త టెర్మినల్ ఏర్పాటు చేశారు. ఆధునీకరించిన విమానాశ్రయాన్ని ప్రధాని వాజ్ పాయ్ ప్రారంభించారు. 2015లో తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా లభించింది. అదే ఏడాది మరో నూతన టెర్మినల్ ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. కానీ ఇప్పటివరకూ అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కాలేదు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో తిరుపతి విమానాశ్రయం ద్వారా 8,40,963 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. కేవలం హైదరాబాద్, ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నంలకు విమాన సర్వీసులు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ విమానాశ్రయం స్థాయిని అందుకునేందుకు రన్ వే ని 3,810 మీటర్లకు అనగా 12500 అడుగులకు విస్తరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 712 ఎకరాల భూమిని ఎయిర్ పోర్ట్స్ అథారిటీకి అప్పగించింది. 200 కోట్ల రూపాయలతో రన్ వే విస్తరణ, పార్కింగ్ పనులకు ఇది వరకే ఆమోదం పొందింది.
Delhi Airport : జల దిగ్బంధంలో ఢిల్లీ ఎయిర్ పోర్టు.. వరద నీటిలో నిలిచిన విమానాలు
రెండు వీఐపీ లాంజ్‌లు, 250 కార్లు పార్కింగ్ చేయగల సామర్థ్యం ఉంది. తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికుల రాకపోకల సంఖ్య పెరుగుతోంది. 2020 మార్చిలో 44వేల 575 మంది ప్రయాణించగా.. 2021 మార్చిలో ప్రయాణికుల సంఖ్య 65వేల 110కి పెరిగింది. 2019 ఏప్రిల్ నుంచి 2020 మార్చి వరకు 8లక్షల 34వేల 984 మంది ప్రయాణికులు తిరుపతికి ప్రయాణించారు. కొవిడ్ కారణంగా మరుసటి విమానా ప్రయాణాలు నిలిచిపోవడంతో 2020 ఏప్రిల్ నుంచి 2021 మార్చి వరకు 3లక్షల 52వేల 375 మంది రాకపోకలు సాగించారు.
నష్టాల బాటలో ఉన్నాయనే… దానితో ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించేందుకు కేంద్రం వేగంగా పావులు కదుపుతున్న సంగతి తెలిసిందే. అయితే ప్రైవేకరించకుండా ప్రత్యామ్నాయమార్గాలపై దృష్టి సారిస్తోంది. ఇతర ప్రభుత్వ రంగ సంస్థల్లో విలీనం చేయాలని భావిస్తోందని సమాచారం. అందులో భాగంగా ఎయిర్ పోర్టుల ప్రైవేటేజేషన్ ప్రక్రియలో తొలిసారి మేజర్ ఎయిర్ పోర్టులతో చిన్న ఎయిర్ పోర్టులను కలుపుతున్నారు. దేశంలోని 13 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకు ఎయిర్ పోర్టు అథార్టీ ఆఫ్ ఇండియా ఓకే చెప్పింది.