జాతి క్షమించరాని నేరానికి జగన్ పాల్పడ్డారు- పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

వృధాగా సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకుని కరవురహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు ఇది. అలాంటి ప్రాజెక్ట్ జగన్ చేసిన విధ్వంసానికి గురైంది.

జాతి క్షమించరాని నేరానికి జగన్ పాల్పడ్డారు- పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు

Polavaram Project White Paper : పోలవరం ప్రాజెక్టుపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. పోలవరానికి శాపం జగన్ అంటూ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. ”ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశాక అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గత ఐదేళ్లు రాష్ట్రం ఏ విధంగా నష్టపోయిందో ప్రజల్లో చర్చ జరగాలి. రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని గుర్తించారు కాబట్టే ఇంత అఖండ విజయం అందించారు. మీడియాను కూడా భయపెట్టే పరిపాలన గత ఐదేళ్లలో జరిగింది. న్యాయస్థానాలను సైతం బ్లాక్ మెయిల్ చేసేలా న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని విమర్శించారు.

రాష్ట్ర పునర్ నిర్మాణo జరగాల్సిన పరిస్థితి నెలకొంది. వివిధ అంశాలపై వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాలని నిర్ణయించాం. రాష్ట్రానికి ఎంత నష్టం జరిగిందో వివరించాలని నిర్ణయించారు. ఎన్నికల్లో ప్రజలు గెలిచారు. ప్రజా సహకారంతో రాష్ట్రాన్ని నిలబెడతాం. ఇందులో భాగంగా బడ్జెట్ కంటే ముందే తొలుత 7 శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నాం.

రాష్ట్రంలో నదుల అనుసంధానానికి గుండెకాయ పోలవరం. అలాంటి పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ జగన్ ఓ శాపంలా మారాడు. వృధాగా సముద్రంలో కలిసే 3వేల టీఎంసీల నీటిని ఒడిసి పట్టుకుని కరవురహిత రాష్ట్రంగా మార్చే ప్రాజెక్టు ఇది. అలాంటి ప్రాజెక్ట్ జగన్ చేసిన విధ్వంసానికి గురైంది. 1941 నుంచి తెలుగు ప్రజల కలగా పోలవరం ఉంది. 90 మీటర్ల కిందవరకూ డయాఫ్రమ్ వాల్ అత్యాధునిక సాంకేతికతతో పూర్తిచేశాం.

పోలవరం అంత భారీ ప్రాజెక్టు దేశంలో ఇక ఉండదేమో? 2014లో తెలంగాణలో 7 ముంపు మండలాలు నేను ప్రమాణ స్వీకారం చేయకముందే ఏపీలో విలీనం జరిగేలా కృషి చేశా. 31 సార్లు క్షేత్రస్థాయి పర్యటనలు, 104 సమీక్షలతో పోలవరం ప్రాజెక్టును పరుగులెత్తిoచి 72శాతం పూర్తి చేశాం” అని సీఎం చంద్రబాబు తెలిపారు.

ఇప్పుడు రూ.990 కోట్లు అదనంగా ఖర్చు అవుతుంది- సీఎం చంద్రబాబు
”డయాఫ్రమ్ వాల్ ను రూ.436 కోట్లతో పూర్తి చేస్తే.. ఇప్పుడు మరమ్మతులకు రూ.447 కోట్లు అవుతుంది. ఇంత ఖర్చు చేసినా నష్టం పూర్తిగా భర్తీ అవుతుందని చెప్పలేం. కొత్త డయాఫ్రమ్ వాల్ కట్టాలంటే ఇప్పుడు రూ.990 కోట్లు అదనంగా ఖర్చవుతుంది. ఇందుకు 2 నుంచి 4 సీజన్ల సమయం కూడా వృధా అవుతుంది. జగన్ మూర్ఖత్వం వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. 2019 జూన్ నుంచి ఏజెన్సీలు తొలగించి పోలవరం పనులు నిలుపుదల చేశారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న విషయం రెండేళ్ల తర్వాత కానీ గుర్తించలేదు.

2009లో కూడా వైఎస్ కాంట్రాక్టర్ ని మార్చటం వల్ల హెడ్ వర్క్స్ నిలిచిపోయాయి. అదే తప్పు జగన్ 2019లో చేసి తీవ్ర తప్పిదానికి పాల్పడ్డారు. జగన్ ప్రభుత్వ తప్పిదాలపై 2019 ఆగస్టు 16న జలవనరుల కార్యదర్శి పీపీఏకి లేఖ కూడా రాశారు. పోలవరం పట్ల జగన్ ప్రభుత్వ తప్పిదాలపై నీతి ఆయోగ్ ఐఐటీ హైదరాబాద్ తో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ 2021 నవంబర్ 5న స్పష్టమైన నివేదిక ఇచ్చింది.”

జగన్ తన అహంకారంతో పోలవరం ప్రాజెక్ట్ ను సర్వనాశనం చేశారు- సీఎం చంద్రబాబు
”పిచ్చి కుక్క, పిచ్చి కుక్క.. అని పదే పదే చెబుతూ మంచి కుక్కని చంపేసిన మాదిరి జగన్ పోలవరం పట్ల వ్యవహరించారు. ప్రాజెక్ట్ ను సర్వనాశనం చేసేందుకు జగన్ అహంతో చేసిన దుస్సాహసమే పోలవరం వినాశనం. జగన్ ప్రభుత్వ నిర్వాకం వల్ల పోలవరం ప్రాజెక్టుకు 4 విధాల నష్టం జరిగింది.
మొదటిది డయాఫ్రమ్ వాల్ అయితే అప్పర్, లోయర్ కాపర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. గైడ్ బండ్ దెబ్బతినడంతో పాటు విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణమూ ఆగిపోయింది. మొత్తంగా పొలవరాన్ని గోదాట్లో ముంచేశారు. ఇప్పుడు కేంద్రం అంతర్జాతీయ నిపుణులతో కమిటీ వేసి నిరంతర అధ్యయనం పెట్టింది.

ఇక్కడ ఉండే సెంట్రల్ వాటర్ కమిషన్ చేతులు ఎత్తేయటంతో అంతర్జాతీయ నిపుణుల నివేదిక ఆధారంగా ఇప్పుడు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణీత సమయానికి పోలవరం పూర్తి చేయకపోవడం వల్ల వేలాది కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పోలవరంలో అవినీతి అంటూ ఎన్నో అసత్య ఆరోపణలు జగన్ చేసినా ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారు. ఐదేళ్ల పోలవరం నష్టం చూస్తుంటే బాధ, కోపం, ఆవేశం కలుగుతున్నాయి” అని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు.

Also Read : అజ్ఞాతంలో.. మీసం మెలేసి, తొడలు చరిచిన ఆ జిల్లా వైసీపీ నాయకులు..!