కరోనా ఎఫెక్ట్ : ఏపీలోనూ అన్నీ బంద్..గవర్నర్ తో సీఎం జగన్ భేటీ

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు అలర్ట్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్, మాల్స్, థియేటర్లు, పబ్బులు తదితర వాటిని మార్చి 31 వరకు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ సీఎం జగన్ కూడా అప్రమత్తమయ్యారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో 2020, మార్చి 15వ తేదీ ఆదివారం సీఎం జగన్ భేటీ అయ్యారు.
కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తున్నారు. వారం రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు సమాచారం. సినిమా హాల్స్, మాల్స్ మూసివేయాలనే దానిపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం సీఎం జగన్..నేరుగా గవర్నర్‌తో భేటీ అయ్యారు.
కరోనా వైరస్ కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలను వివరిస్తున్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా పడడంపై గవర్నర్ కు వివరించినట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో ప్రతిపక్షం చేస్తున్న విమర్శలు, ఆరోపణలను కూడా తెలియచేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఏపీలో బడ్జెట్ సమావేశాలపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.
ఇక కరోనా విషయానికి వస్తే..ఏపీలో పలు జిల్లాల్లో పలువురికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. వారికి చికిత్స అందిస్తున్నారు. వీరి రక్తనమూనాలను పూణే ల్యాబ్ కు పంపించారు. నెల్లూరులో స్కూల్స్, మాల్స్, ర్యాలీలు, సభలపై ఆంక్షలు విధించారు. 13 జిల్లాల్లో ఐసోలేషన్ వార్డులను ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తిరుపతిలో ల్యాబ్ ఏర్పాటు చేశారు.
విజయవాడలోని సిద్ధార్థ కాలేజీలో మరో ల్యాబ్ ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ లక్షణాలు కనిపించగానే..వారిని ప్రత్యేక వార్డుల్లో వారికి చికిత్స అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వైరస్ పై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుందో..కాసేపట్లో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.