దుబాయ్‌లో ఆపరేషన్ ఆకర్ష్: నారాయణ సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఆపరేషన్ ఆకర్ష్ జరగబోతోందని..ఇందుకు దుబాయ్ వేదిక కానుందంటూ సంచలన కామెంట్లు చేశారు సీపీఐ నేత నారాయణ. దుబాయిలో సీఎం రమేశ్ కొడుకు నిశ్చితార్థం ద్వారా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరతీయనున్నారని తెలిపారు. 2019, నవంబర్ 24వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అలాగే మహారాష్ట్రలో జరిగిన రాజకీయ పరిణామాలపై ఆయన స్పందించారు.
వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక విమానంలో వెళుతున్నారని సమాచారం ఉందన్నారు. నవరత్నాల కోసం ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడమేనన్నారు. ప్రధాన మంత్రి మోడీ, అమిత్ షాల రాజకీయంతో రాజ్యాంగ వ్యవస్థ కుప్పకూలిందన్నారు. అజిత్ పవార్‌ను బ్లాక్ మెయిల్ చేసి దారికి తెచ్చుకున్నారని తెలిపారు.
గత కొన్ని రోజులుగా వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి. బీజేపీ కూడా వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. కొంతమంది టీడీపీకి చెందిన నేతలు వైసీపీలోకి జంప్ అవుతున్నారు. ఇటీవలే వల్లభనేని వంశీ టీడీపీపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకపడ్డారు. ఇదిలా ఉంటే..20మంది వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని బీజేపీ నేత, ఎంపీ సుజనా చౌదరి కామెంట్స్ రచ్చ రచ్చ చేస్తున్నాయి. బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారని చెప్పారు. తమతో సంప్రదింపులు జరుపుతున్నారని వెల్లడించారు. తాజాగా సీపీఐ నేత నారాయణ చేసిన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపుతాయో చూడాలి.
Read More : బాలికను కిడ్నాప్ చేసి హత్య చేసిన సవతి తల్లి