చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉండాలి- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

గత ప్రభుత్వంలో ఏ నెల కూడా మొదటి రోజున ఉద్యోగులకు జీతాలు పడింది లేదు.

చంద్రబాబు మరో పదేళ్లు సీఎంగా ఉండాలి- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు..

Pawan Kalyan Praises Cm Chandrababu (Photo Credit : Google)

Updated On : November 20, 2024 / 10:57 PM IST

Pawan Kalyan : వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి వెనక్కి వెళ్లిందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలో పాలనను సీఎం చంద్రబాబు గాడిన పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. కూటమి 150 రోజుల పాలన ఏపీ ప్రజల భవిష్యత్తు పట్ల నమ్మకాన్ని ఇచ్చిందని తెలిపారు. ఏపీ ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్లకు తీర్చిదిద్దామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్రతి నెల 1వ తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నామన్నారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టే వారిపై కఠిన చర్యలు ఉంటాయని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఇక, ఐదేళ్లు కాదు దశాబ్ద కాలం పాటు చంద్రబాబు నాయుడే ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని పవన్ కల్యాణ్ కోరారు.

”పాలసీ మేకర్, ముఖ్యమంత్రి. ఆయనను కూడా ఇబ్బంది పెట్టారు. జైల్లో పెట్టారు. 150 రోజుల పాలనపై సీఎం చంద్రబాబు చెప్పిన మాటలు ఉత్సాహం నింపాయి. ప్రజల భవిష్యత్తు పట్ల విశ్వాసం తీసుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ 1 ట్రిలియన్ డాలర్ (7లక్షల 65వేల కోట్ల రూపాయలు) ఎకానమీగా అతి త్వరలోనే సాధిస్తుందని సంపూర్ణ విశ్వాసం ఉంది. గత ప్రభుత్వం ఎకానమీని నిర్వీర్యం చేసింది. ఇబ్బంది పాలు చేసింది. అన్ని రంగాల్లోనూ రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లింది. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, పారదర్శకత, విజినరీ, దృష్టి.. ఇవన్నీ 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధన వైపు తీసుకెళ్తున్నాయి అనే దానిలో ఏ మాత్రం సందేహం లేదు.

గత ప్రభుత్వంలో ఏ నెల కూడా మొదటి రోజున ఉద్యోగులకు జీతాలు పడింది లేదు. అలాంటిది కూటమి పాలనలో ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందుతున్నాయి. ఇందుకు మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందలు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ కలలు అయితే కన్నారో వాటిని నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. చంద్రబాబు ఐదేళ్లు కాదు ఇంకో పదేళ్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగాల్సిన అవసరం ఉంది. ఇదే పాలన అందించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నా” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Also Read : ఎగ్జిట్ పోల్స్.. మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో కమల వికాసం..! ఎన్డీయే కూటమి వైపే సర్వే సంస్థల మొగ్గు..