Banakacherla Project: బనకచర్లకు బ్రేక్..! ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్రం.. చంద్రబాబు ఏం చేయబోతున్నారు?

ఈ ప్రాజెక్ట్ ను పరిశీలించాల్సి ఉందన్న కమిటీ.. బనకచర్లపై అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది.

Banakacherla Project: బనకచర్లకు బ్రేక్..! ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వెనక్కి పంపిన కేంద్రం.. చంద్రబాబు ఏం చేయబోతున్నారు?

Updated On : July 1, 2025 / 12:51 AM IST

Banakacherla Project: ఏపీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్ ప్రతిపాదనలను వెనక్కి పంపింది కేంద్రం. పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటే సీడబ్లుసీ అత్యవసరంగా పరిశీలించాల్సి ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ కూడా ఈ ప్రాజెక్ట్ ను పరిశీలించాల్సి ఉందన్న కమిటీ.. బనకచర్లపై అనేక ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. బనకచర్ల ప్రాజెక్ట్ గోదావరి ట్రైబ్యునల్ తీర్పునకు వ్యతిరేకమని ఫిర్యాదులు వెల్లువెత్తాయని, ఈ ఫిర్యాదుల కారణంగా ప్రతిపాదనలను వెనక్కి పంపుతున్నామని వెల్లడించింది.

ప్రతిపాదిత పోలవరం-బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ (EAC) నిరాకరించింది. కమిటీ అభ్యంతరాలను ఉదహరించింది. గోదావరి జల వివాద ట్రిబ్యునల్ (GWDT) తీర్పునకు అనుగుణంగా ఏదైనా తదుపరి పురోగతి ఉండాలని నొక్కి చెప్పింది. ఈ ప్రతిపాదనను పరిశీలించడానికి జి.కె. చక్రపాణి అధ్యక్షతన నిపుణుల అంచనా కమిటీ (EAC) జూన్ 17న వర్చువల్ మోడ్‌లో సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ఈమెయిల్స్, ఇతర మార్గాల ద్వారా పెద్ద ఎత్తున వచ్చిన అభ్యంతరాలను కమిటీ పరిగణనలోకి తీసుకుంది.

బనకచర్ల ప్రాజెక్ట్ 1980 GWDT తీర్పును ఉల్లంఘిస్తుందని అధికంగా ఫిర్యాదులు వచ్చాయి. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో ముంపు సమస్యల గురించి, పెండింగ్‌లో ఉన్న చట్టపరమైన వివాదాల గురించి కూడా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. వరద నీటి నిర్వహణ, సమగ్ర మూల్యాంకనం కోసం పర్యావరణ అంతర్-రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి కేంద్ర జల సంఘం (CWC)ని సంప్రదించాలని కమిటీ సూచించింది.

బనకచర్ల ప్రాజెక్ట్ రాజకీయ రంగు పులుముకుంది. తెలంగాణ, ఏపీ మధ్య చిచ్చు రాజేసింది. తెలంగాణలోని పార్టీలు బనకచర్లపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ కట్ట బనకచర్ల ప్రాజెక్ట్ తో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బనకచర్ల ప్రాజెక్ట్ పై కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఈ పరిస్థితుల్లో కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నిర్ణయానికి తమ పోరాటమే కారణం అని బీఆర్ఎస్ చెబుతుండగా, సీఎం రేవంత్ ఢిల్లీకి వెళ్లి మాట్లాడటం వల్లే కేంద్రం వెనక్కి తగ్గిందని కాంగ్రెస్ అంటోంది.

Also Read: శ్రీశైలం లడ్డూ ప్రసాదంలో బొద్దింక ఆరోపణల వెనుక కుట్ర కోణం..! సీసీటీవీ ఫుటేజ్‌తో బట్టబయలు..

కాగా, పోలవరం-బనకచర్ల ప్రాజెక్ట్ కు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పనులను కూడా ప్రారంభించింది. ఇలాంటి సమయంలో ప్రాజెక్ట్ కు అనుమతి ఇవ్వలేము అని కేంద్ర నిపుణుల కమిటీ చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. మరిప్పుడు సీఎం చంద్రబాబు ఏం చేయబోతున్నారు? ఈ ప్రాజెక్ట్ అనుమతులపై ఆయన ఏ విధంగా ముందుకెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది.