చంద్రబాబు చేసిన దుర్మార్గాలను జగన్‌పై వేయాలని చూస్తున్నారు- అంబటి రాంబాబు

రాష్ట్రంలో కావాలనే విధ్వంసం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసిన వారి మీద కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు?

చంద్రబాబు చేసిన దుర్మార్గాలను జగన్‌పై వేయాలని చూస్తున్నారు- అంబటి రాంబాబు

Ambati Rambabu : పోలవరం ఏపీ ప్రజల జీవనాడి అని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అలాంటి ప్రాజెక్ట్ నిర్మాణంలో విపరీతమైన ఆలస్యం అవుతోందని చెప్పారు. చంద్రబాబు హయాంలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని అంబటి రాంబాబు ఆరోపించారు. దానికి కారణం జగన్ అంటూ గోబెల్స్ ప్రచారం చేశారని మండిపడ్డారు. చంద్రబాబు వలన డయాఫ్రం వాల్ కొట్టుకుపోవటమే కాకుండా ప్రాజెక్ట్ నిర్మాణం ఆలస్యం అవుతోందన్నారు.

”450 మీటర్ల వరకు డయాఫ్రం వాల్ దెబ్బతింది. దాని మీద కేంద్ర ప్రభుత్వంతో జగన్ అనేకసార్లు మాట్లాడారు. దేశంలో నిపుణులు లేనందున ఇతర దేశాల నిపుణులను పిలిపించి విచారణ జరిపించాం. అంతర్జాతీయ కమిటీతో విచారణ జరిపించాం. వారు 12న ఫైనల్ రిపోర్ట్ ఇచ్చారు. నదిని డైవర్ట్ చేయకుండా డయాఫ్రం వాల్ నిర్మాణం వద్దని మేము కూడా చెప్పాం. 2016 డిసెంబర్ నుండి ప్రాజెక్టును పట్టించుకోలేదని, వరద నీరు స్పిల్ వే మీదకు వెళ్లకు ముందే కాపర్ డ్యాం చేపట్టటం వలన నష్టం వచ్చిందని కమిటీ చెప్పింది.

2018లో వరద వచ్చినప్పుడు సరైన చర్యలు తీసుకోనందనే ప్రాజెక్ట్ దెబ్బతింది. గ్యాప్ 2 లో డయాఫ్రం వాల్ బాగా దెబ్బతిందని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. మా ప్రభుత్వం వచ్చాకే ప్రధాన డ్యామ్ దెబ్బ తినకుండా చర్యలు చేపట్టిందని కూడా కమిటీ చెప్పింది. మా హయాంలో రెండు కాఫర్ డ్యామ్ ల నిర్మాణం చేపట్టడంపై కమిటీ మెచ్చుకుంది.

పోలవరం ప్రాజెక్ట్ పనుల మీద చర్చకు రాగలరా? మీడియా సమక్షంలో చర్చకు మేము సిద్దమే. మంత్రి రామానాయుడు వచ్చినా చర్చకు సిద్ధమే. రూ.12వేల కోట్ల కేంద్ర నిధులను రానీకుండా చంద్రబాబు అప్పట్లో అడ్డుకున్నారు. ఇప్పుడు కేంద్రంతో కూటమిలో ఉన్నందున ఇప్పుడైనా ఆ నిధులు తేవాలి. ప్రాజెక్టులో పాపం చంద్రబాబుదే. ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. ఎల్లో మీడియా వాస్తవాలను రాయాలి. ఇది ముసాయిదా రిపోర్టు ఐతే ఫైనల్ రిపోర్టులో మేనేజ్ చేయాలనుకుంటున్నారా? చంద్రబాబు ధనార్జన వలనే ప్రాజెక్ట్ నష్టపోయింది. చట్ట విరుద్ధంగా పని చేసే వారిని రెడ్ బుక్ లో రాసుకున్నానని లోకేశ్ అన్నారు. ప్రతి ఎమ్మెల్యేని బట్టలు ఊడదీసి నిలబెడతానన్నారు. ఒక రాజకీయ నాయకుడు అనాల్సిన మాటలేనా ఇవి?

రాష్ట్రంలో కావాలనే విధ్వంసం చేస్తున్నారు. అంబేద్కర్ విగ్రహం మీద దాడి చేసిన వారి మీద కనీసం కేసు ఎందుకు నమోదు చేయలేదు? ఇంతకంటే దుర్మార్గమైన చర్య ఇంకేమైనా ఉందా? చంద్రబాబు చేసిన దుర్మార్గాలను జగన్ పై వేయాలని చూస్తున్నారు” అని విరుచుకుపడ్డారు అంబటి రాంబాబు.

Also Read : ఏపీలో వరుస కేసులు.. ఒకరి తర్వాత ఒకరు.. నెక్ట్స్‌ లిస్ట్‌లో వచ్చే పేరు ఎవరిదో?