Roja : వచ్చేది మా ప్రభుత్వమే, ఎవరినీ వదలం- కూటమి ప్రభుత్వానికి మాజీమంత్రి రోజా వార్నింగ్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులతో వేధిస్తోంది.

Roja : కూటమి ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి రోజా. కూటమి ప్రభుత్వం వచ్చాక తప్పుడు కేసులు పెట్టి వైసీపీ నేతలను వేధిస్తున్నారని రోజా ఆరోపించారు. జమిలి ఎన్నికలైనా, సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైసీపీనే అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వచ్చేది వైసీపీ ప్రభుత్వమే అన్న రోజా.. ఎవరినీ వదిలేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
”ఉత్తరాంధ్రలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఏ విధంగా కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిని ఎలా ఓడించారో అర్థమైతే రాబోయే జమిలి ఎన్నికలైనా, సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అనేది తెలుసుకోండి. ఇకనైనా అధికారులు న్యాయబద్ధంగా వ్యవహరించాలి. మితిమీరితే బాధపడే రోజులు వస్తాయి.
మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, కూటమి ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నా. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులతో వేధిస్తోంది. ఇవాళ రాష్ట్రంలో మద్యం, బెల్ట్ షాపులు వీధివీధిన పెట్టి, విచ్చలవిడిగా మద్యం అమ్ముతూ, ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరిగే విధంగా చేస్తున్నారో కళ్లారా గమనించండి.
Also Read : దమ్ముంటే రా.. చెవిరెడ్డికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి సవాల్..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి ఎలా అడ్డాగా మారిందో కళ్లారా చూస్తున్నారు. చంద్రబాబు నివాసం ఉంటున్న గుంటూరులో డ్రగ్స్ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని పేపర్లలో చూస్తున్నారంటే ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి సిగ్గుపడాలి. గుంటూరు ఎడ్యుకేషనల్ హబ్. ప్రైవేట్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు, ఇంజినీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఆయుర్వేదిక్ కాలేజీలు ఇలా ఎన్నో కాలేజీలు గుంటూరులో ఉన్నాయి. అలాంటి గుంటూరు గంజాయికి అడ్డాగా మారింది” అని విరుచుకుపడ్డారు రోజా.
”కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు మంచి చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి, మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేర్చాలనే చిత్తశుద్ధి లేకుండా.. కేవలం రెడ్ బుడ్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. వైసీపీ నేతలపై కేసులు పెట్టి వాళ్లను అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకెళ్లి, కోర్టులో బెయిల్ ఇచ్చేలోగా మరో పోలీస్ స్టేషన్ లో మరో కేసు పెట్టి మళ్లీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తున్నారు.
అక్కడి నుంచి బయటకు వస్తే మళ్లీ ఇంకో కేసు పెట్టి మరో చోటుకి తీసుకెళ్తున్నారు. పోసాని కృష్ణమురళి కేసులో మనం కళ్లారా చూస్తున్నాం. అలా చాలా మందిపై జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి. సుప్రీంకోర్టు క్లియర్ గా మార్గదర్శకాలు ఇచ్చింది. ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఆ వ్యక్తిపై వేర్వేరు పోలీస్ స్టేషన్లలో కేసులు ఉంటే వాటన్నింటికి పీటీ వారెంట్ ఇచ్చి ఒకేచోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్నా.. వాంటెడ్ గా ఈరోజు జిల్లా జిల్లాలకు తిప్పుతున్నారు.
Also Read : నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. మెగా డీఎస్సీపై నారా లోకేశ్ ప్రకటన
పోసాని ఆరోగ్యం బాగోలేకపోయినా టార్చర్ పెడుతున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను కూడా తిలోదకాలు ఇచ్చి అధికార పార్టీ వాళ్లు చెప్పినట్లుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం. అధికార పార్టీ చెప్పిందని అధికారులు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తిలోదకాలు ఇస్తే మూల్యం చెల్లించుకోకతప్పదు. ఇవాళ మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడొచ్చు.
కానీ, భవిష్యత్తులో రాబోయే వైసీపీ ప్రభుత్వమే. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన అధికారులను, మా వాళ్లను ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులను మిస్ యూజ్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకులను ఎవరినీ వదిలిపెట్టం. న్యాయబద్ధంగా అందరినీ కూడా శిక్షిస్తాం” అని హెచ్చరించారు రోజా.