మెగాస్టార్ చిరంజీవికి సీఎం చంద్రబాబు అప్పగించనున్న ఆ కీలక పదవి ఏది?
ఏపీ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవి భాగం కానున్నారా? గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజమెంత?

Gossip Garage : ఏపీలో ప్రభుత్వం నడుపుతున్న మెగా జోడీ చంద్రబాబు, పవన్‌కల్యాణ్… జోడెద్దుల్లా కొత్త సర్కార్‌ను పరుగులు పెట్టిస్తున్న ఈ ఇద్దరూ మరో మెగా పవర్‌ను తమతో కలుపుకోవాలని చూస్తున్నారా? రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు సినీ రంగాన్ని అభివృద్ధి చేయాలని భావిస్తున్న ప్రభుత్వ పెద్దలు.. టాలీవుడ్ పెద్ద దిక్కుకు కీలక బాధ్యతలు అప్పగించనున్నారా? తెలుగు ఇండస్ట్రీ పెద్దన్న… మెగాస్టార్ చిరంజీవికి ఓ కీలక పదవి అప్పగించడం ద్వారా ఏపీకి సినీ సొబగులు అద్దాలని చూస్తున్నారా? కూటమి నేతల ప్లాన్ ఏంటి? మెగాస్టార్ ఏమంటున్నారు?
ఏపీకి సినీ ఇండస్ట్రీని తీసుకొచ్చే ప్లాన్..
ఏపీ ప్రభుత్వంలో మెగాస్టార్ చిరంజీవి భాగం కానున్నారా? గత కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజమెంత? సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నెలరోజులవుతోంది. ఈ నెల రోజుల్లో ప్రభుత్వ పరంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఇందులో ప్రధానమైనది రాజధాని అమరావతికి సినీ ఇండస్ట్రీని తీసుకురావడం… ఇప్పటికే కొంతమంది సినీ నిర్మాతలు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసి చర్చించారు. కొంతమంది సినీ పెద్దల భాగస్వామ్యంతో అమరావతిలో స్టుడియో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఒక్క స్టుడియో నిర్మిస్తే సరిపోదని భావిస్తున్న కూటమి ప్రభుత్వం…. తెలుగు చిత్ర పరిశ్రమను రాష్ట్రంలో విస్తరించే వ్యూహాంలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి సేవలను వాడుకోవాలని చూస్తోందట..
మెగాస్టార్ చిరంజీవి సేవలను వాడుకోవాలని ప్రతిపాదనలు..
ఏపీ ప్రభుత్వం… సినీ పరిశ్రమకు మధ్య వారధిగా చిరంజీవి ఉండాలని భావిస్తున్నారట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్. తెలుగు సినీ పరిశ్రమ పెద్దగా చిరంజీవికి ఎంతో గౌరవం ఉంది. ఆయన చొరవ తీసుకుంటే ఏపీలో సినిమా రంగం అభివృద్ధికి బాటలు పడతాయని విశ్లేషిస్తున్నారు. ఇటు ప్రభుత్వంలోనూ చిరంజీవి మాటను కాదనలేని పరిస్థితి ఉండటం వల్ల సినీ రంగ ప్రముఖులకు ప్రభుత్వంపై నమ్మకం కల్పించి పెట్టబడులను ఆకర్షించొచ్చని లెక్క వేస్తున్నారు. ఐతే ఏ పదవీ లేకుండా చిరంజీవి సేవలను వాడుకునే కన్నా, ఆయనకు సముచిత గౌరవం దక్కేలా ఓ పదవిని అప్పగించాలని భావిస్తున్నారు. చిరంజీవి స్థాయికి తగ్గ గౌరవం ఉన్న పదవి ఏమున్నదనే ఆరా తీస్తోంది ప్రభుత్వం.
చిరంజీవి స్థాయికి తగ్గ పదవిపై విస్తృత చర్చలు..
2009లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన చిరంజీవి… ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 ఎన్నికల తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న మెగాస్టార్.. కూటమి ప్రభుత్వానికి పరోక్షంగా సహకరించారనే అభిప్రాయం ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు అన్నివిధాల అండదండగా నిలిచిన చిరంజీవి.. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి కుటుంబంతో సహా హాజరయ్యారు. ఇక ఆ తర్వాత కూడా ఏపీ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని ప్రకటించారు. దీంతో ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధికి మెగాస్టార్ సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది ప్రభుత్వం. ఇందుకోసం ఆయనకు ఓ పెద్ద పదవికి అప్పగించాలని నిర్ణయించిందని సమాచారం.
చిరంజీవికి కీలక బాధ్యతలు..!
ఇప్పటికీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పరిశీలనలో ఉన్న అంశంపై ఇరు పార్టీల్లో విస్తృతంగా చర్చిస్తున్నారని తెలుస్తోంది. అయితే చిరంజీవికి ఏ స్థాయి పదవి అప్పగిస్తే గౌరవం ఉంటుందనేదే విషయంపైనే స్పష్టతకు రాలేకపోతున్నారట. ఏదిఏమైనా ఏపీ ప్రభుత్వం, సినీ పరిశ్రమ మధ్య వారధిగా చిరంజీవికి కీలక బాధ్యతలు అప్పగించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. ఇది ఎప్పటికి పట్టాలు ఎక్కుతుందనేదే ఆసక్తి రేపుతోంది.
Also Read : టార్గెట్ జగన్..! శ్వేతప్రతాల వెనుక చంద్రబాబు భారీ వ్యూహం..!