‘మరో రెండు రోజుల్లో’ అంటూ పొత్తులపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్

నాగబాబైనా ఇంకో బాబైనా వారందరి సీట్లనూ బాబు డిసైడ్..

‘మరో రెండు రోజుల్లో’ అంటూ పొత్తులపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కామెంట్స్

Gudivada Amarnath

Updated On : February 20, 2024 / 4:35 PM IST

Gudivada Amarnath: రెండు రోజుల్లో ఎన్డీఏ కూటమిలో టీడీపీ-జనసేన చెరబోతున్నాయని ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అన్ని పార్టీలు కలిసి ఎన్నికలకు వస్తాయని, అప్పుడు సీట్లన్నీ బాబు డిసైడ్ చేస్తారని చెప్పారు.

నాగబాబైనా ఇంకో బాబైనా వారందరి సీట్లనూ బాబు డిసైడ్ చేస్తారని ఎద్దేవా చేశారు. ఎవరు ఎవరితో కలిసి వచ్చినా తమ విధానంలో మార్పు లేదని స్పష్టం చేశారు. ఏదో జరిగిపోతుందని అనుకోవద్దని అన్నారు.

టీడీపీ నేత నారా లోకేశ్‌పై గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. లోకేశ్ చేసిన ఆరోపణలు నిరూపిస్తే తాను రాజకీయాలు వదిలేస్తానని అన్నారు. విస్సన్నపేట భూముల కుంభకోణం అంటూ ఆరోపణలు చేస్తున్నారని, పవన్ కల్యాణ్ కూడా అక్కడకు వెళ్లి, ఏమి సాధించారని ప్రశ్నించారు.

టీడీపీ ఉత్తరాంధ్రకు ఏమి చేసిందని నిలదీశారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం ఒక్క పోర్టయినా కట్టాలని అనుకున్నారా? అని అన్నారు. తాను మంత్రిగా ఉండగా ఉత్తరాంధ్రకు ఎయిర్ పోర్ట్, పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని చెప్పారు. లోకేశ్ తన స్థాయిని మరచి మాట్లాడుతున్నారని అన్నారు.

తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, లోకేశ్ సిగ్గులేని వ్యక్తులని అన్నారు. తాను లోకేశ్‌లా బ్యాక్ డోర్ పొలిటీషియన్ కాదని చెప్పుకొచ్చారు. రాజకీయాల్లో 18 ఏళ్లు కష్టపడి సీఎం జగన్ దయవల్ల తాను మంత్రి అయ్యానని అన్నారు.

 Read Also: అందుకే మళ్లీ వైసీపీలో చేరాను: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి