AP Rains: ఏపీని వీడని వర్షం.. మరోసారి ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

గత కొన్ని నెలలుగా ఏపీని వర్షం వీడటం లేదు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న వాయుగుండాల కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.

AP Rains: ఏపీని వీడని వర్షం.. మరోసారి ఆ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు

Updated On : December 18, 2024 / 10:35 AM IST

AP Rains: గత కొన్ని నెలలుగా ఏపీని వర్షం వీడటం లేదు. బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న వాయుగుండాల కారణంగా ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్టోబర్ లో దానా, నవంబర్ నెలలో ఫెంగల్ తుపానుల ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా ఏపీలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికితోడు వాతావరణంలో మార్పుల కారణంగా ఏపీలో అడపాదడపా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా ఏపీలో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో రెండు రోజుల్లో మరింత బలపడే అవకాశం ఉందని, ఈ కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

AP Rains

అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తా తీరంలో గంటకు గరిష్టంగా 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. అల్పపీడనం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. సముద్రంలో భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. అలల ధాటికి సముద్రం కోతకు గురవుతుంది. ఇదిలాఉంటే.. ఇవాళ కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్టణం జిల్లాల్లో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్టణం జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా.. మిగిలిన ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ ను అధికారులు జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు.

AP Rains

పంటలు చేతికొచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలకు పెద్ద సంఖ్యలో ఏపీలోని పలు జిల్లాల్లో పంటనష్టం వాటిల్లింది. మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారు.