Konaseema Internet Shutdown : వర్క్ ఫ్రమ్ గోదారి గట్టు.. కోనసీమలో ఐటీ ఉద్యోగుల కష్టాలు
అమలాపురంలో అల్లర్ల తర్వాత ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. దీంతో ఐటీ ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. చివరికి గోదావరి నది ఒడ్డున నిలబడి పని చేసుకుంటున్నారు.(Konaseema Internet Shutdown)

Konaseema Internet Shutdown
Konaseema Internet Shutdown : కోనసీమ జిల్లాలోని సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు కష్టం వచ్చి పడింది. ఇంటర్నెట్ బంద్ కావడంతో వారు ఇబ్బందులు పడుతున్నారు. చివరికి గోదావరి నది ఒడ్డున నిలబడి పని చేసుకుంటున్నారు. అక్కడ ఇంటర్నెట్ సర్వీస్ వస్తుండటంతో ల్యాప్ ట్యాప్ లు అక్కడికి తీసుకెళ్లి విధులు నిర్వహిస్తున్నారు. అమలాపురంలో అల్లర్ల తర్వాత జిల్లాలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. గత మూడు రోజులుగా ఇంటర్నెట్ సర్వీస్ కట్ చేశారు. దీంతో ముక్తేశ్వరంలోని ఐటీ ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు.
అమలాపురంలో విధ్వంసకాండ జరిగి మూడు రోజులు కావొస్తోంది. అమలాపురం ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రశాంత వాతావరణం నెలకొని ఉంది. ప్రజలకు నిత్య కార్యక్రమాలకు ఇబ్బందులు లేకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. అల్లర్లు జరిగిన మరుసటి రోజు నుంచి కూడా పూర్తిగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అవాంఛనీయ సంఘటనలు, గొడవలు జరక్కుండా, వాట్సాప్ గ్రూపుల్లో రెచ్చగొట్టే అంశాలు ఫార్వార్డ్ చేసుకోకుండా ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.(Konaseema Internet Shutdown)
Konaseema Tension : అమలాపురంలో ఉద్రిక్తత-పేరు మార్పుపై రెచ్చిపోయిన ఆందోళనకారులు
అయితే, అమలాపురం పరిసర ప్రాంతాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇంటర్నెట్ సర్వీస్ నిలిచిపోవడంతో వారి విధులు ఆగిపోయాయి. ఈ క్రమంలో ముక్తేశ్వరం ప్రాంతంలో కొద్దిమేర ఇంటర్నెట్ సర్వీస్ వస్తోంది. ఈ విషయం తెలుసుకున్న టెకీలు.. తమ ల్యాప్ ట్యాప్ లు తీసుకుని ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే తమ విధులు నిర్వహిస్తున్నారు.
కోనసీమ జిల్లా పేరును డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న అగ్గి రాజేసింది. పేరు మార్పుని నిరసిస్తూ జిల్లా కేంద్రం అమలాపురంలో ఈనెల 24న కోనసీమ జిల్లా సాధన సమితి తలపెట్టిన భారీ ర్యాలీ విధ్వంసకాండకు దారితీసింది. మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఇళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. మూడు బస్సులను తగులబెట్టారు. ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా ఉండేలా ముందు జాగ్రత్తగా కోనసీమలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది ప్రభుత్వం.
Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్
కోనసీమలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకింగ్ సేవలతో పాటు ఆన్ లైన్ సేవలు( ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం సర్వీసులు) నిలిచిపోయాయి. ఇంటర్నెట్ సర్వీస్ లేకపోవడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే టెకీల పనులు ఆగిపోయాయి. దీంతో వారి కంపెనీల నుండి తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయి. నేరుగా కంపెనీలకు వచ్చేయాలని యాజమాన్యాలు చెబుతున్నాయని ఉద్యోగులు వాపోయారు. వీలైనంత తొందరగా తమకు ఇంటర్నెట్ సేవలు పునరుద్దరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అమలాపురం, రావులపాలెంలో భారీగా పోలీసులు మోహరించారు. జిల్లా పేరు మార్పునకు సంబంధించిన అభ్యంతరాల స్వీకరిస్తున్నారు. ఇందుకోసం కలెక్టర్ కార్యలయంలో ప్రత్యేక బాక్స్ ఏర్పాటు చేశారు. ఘర్షణల నేపథ్యంలో కలెక్టరేట్ లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.