Pawan Kalyan : టీచర్లు, ఉద్యోగులు రోడ్ల మీదకు రావడం బాధించింది-పవన్ కళ్యాణ్
జీతాలు పెంచాము అని చెప్పి తగ్గించడం మోసపూరితమైన చర్య. ఉద్యోగులను ఈ ప్రభుత్వం వంచించింది. ఉద్యోగులను చర్చలకు పిలిచి అవమానించారు.

Pawan Kalyan
Pawan Kalyan : తమ డిమాండ్ల సాధన కోసం టీచర్లు, ఉద్యోగులు రోడ్ల మీదకు వచ్చి నిరసనలు తెలపడం బాధ కలిగించిందని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు. పాఠాలు చెప్పే టీచర్ల ఇతర ఉద్యోగులు రోడ్డు మీదకు వచ్చి ప్రభుత్వంపై కోపాన్ని, అసహనాన్ని ప్రదర్శించే పరిస్థితి రావడం ఆవేదనకు గురి చేసిందన్నారు. నేను కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకునే అని పవన్ అన్నారు. టీఏలు, డీఏలు, పీఆర్సీ వంటి వాటితో జీతాలు పెరగాలని ఉద్యోగులు చూడటం సహజం అన్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు సీఎం జగన్ ఇచ్చిన సీపీఎస్ ఇచ్చిన హామీ ఏమైందని పవన్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామన్నారు, కానీ ఇంతవరకు పట్టించుకోలేదన్నారు.
”జీతాలు పెంచాము అని చెప్పి తగ్గించడం మోసపూరితమైన చర్యగా జనసేన భావిస్తుంది. దీని కోసం ఎప్పుడో మాట్లాడాలని అనుకున్నా. కానీ, ఏ రాజకీయ పార్టీ సహకారం అక్కర్లేదు అని ఉద్యోగ సంఘాలు అనడంతో ఒక అడుగు వెనక్కి వేశా. పెంచాము అని చెప్పిన జీతాలు 5 నుండి 8 వేలు తగ్గడంతో నిరసన కార్యక్రమం చేశారు. అధికారంలోకి వచ్చేందుకు ఒక మాట.. వచ్చిన తర్వాత ఇంకో మాట వైసీపీ మాట్లాడుతుంది. ఉద్యోగులను ఈ ప్రభుత్వం వంచించింది. ఉద్యోగులను చర్చలకు పిలిచి అవమానించారు.
WhatsApp New Update : వాట్సాప్ మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్.. 2 రోజులకు పొడిగించే అవకాశం!
ఇప్పటికైనా సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరగాలి. మళ్లీ ఉద్యోగులు విధులకు సంతోషంగా హాజరుకావాలని జనసేన భావిస్తుంది. వైసీపీ నాయకుల ఆదాయం మూడు రెట్లు పెరిగితే ఉద్యోగుల ఆదాయం 30 శాతం తగ్గింది. ఉద్యోగులను కించపరిచే మాటలు, బెదిరించే ధోరణి మానుకోవాలి. ఎంప్లాయిస్ కు మీరు ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి అని జనసేన కోరుకుంటుంది. జనసేన పార్టీ ఎప్పుడూ ఉద్యోగులకు అండగా ఉంటుంది” అని మరోసారి స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
పీఆర్సీ జీవోలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్ తో చేపట్టిన ‘ఛలో విజయవాడ’ కార్యక్రమానికి ఉద్యోగులు వేలాదిగా తరలివచ్చారు. ఛలో విజయవాడ కార్యక్రమం విజయవంతం చేసిన ఉద్యోగులందరికీ పీఆర్సీ సాధన సమితి నేతలు కృతజ్ఞతలు తెలిపారు. తీవ్ర నిర్బంధాల మధ్య కూడా లక్ష మంది విజయవాడ వచ్చారని వెల్లడించారు. మరో 3 లక్షల మందిని ప్రభుత్వం అడ్డుకుందని ఆరోపించారు.
సీఎం జగన్ ఉద్యోగులను చర్చలకు పిలవాలని, ఉద్యోగుల సమస్యలపై నేరుగా చర్చించి న్యాయం చేయాలని ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు. తాము శాంతియుతంగానే నిరసనలు తెలియజేస్తున్నామని, సీఎం జోక్యం చేసుకుని చర్చలతో సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఛలో విజయవాడ కార్యక్రమం చూశాక అయినా ఉద్యోగుల ఆందోళనలను ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సీపీఎస్ రద్దయ్యేవరకు ఆందోళనలు కొనసాగుతాయని తెలిపారు.
Stomach Problem : పొట్ట సమస్య బాధిస్తుందా!…పరిష్కారం మీచేతుల్లో?…
తాము ఛలో విజయవాడ కార్యక్రమం నిర్వహించింది బల ప్రదర్శన కోసం కాదని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. ఉద్యోగుల వేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే తమ ఉద్దేశం అన్నారు. ఈ నెల 5 నుంచి పెన్ డౌన్ ఉంటుందని, 6వ తేదీ అర్ధరాత్రి నుంచి పూర్తిగా సమ్మెలోకి వెళతామని వెల్లడించారు.