Gudivada Amarnath : సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే అలా చేస్తా- మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ క్రమంలో వైసీపీలో భారీ మార్పులకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Minister Gudivada Amarnath (Photo : Google)
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధినేత జగన్.. పార్టీలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈసారి కొందరు ఎమ్మెల్యేలకు టికెట్ ఇవ్వకూడదని సీఎం జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాదు అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలను కూడా మార్చేస్తున్నారు. ఇప్పుడున్న వారిని తీసేసి కొత్త వారికి బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో అధికార పార్టీ వైసీపీలో ఒక్కసారిగా కలకలం రేగింది. టికెట్ల అంశం ఎమ్మెల్యేలలో గుబులు పుట్టిస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్యేలు, ఇంఛార్జిల కంటే ప్రజలు, లక్షల మంది కార్యకర్తలు ముఖ్యమని మొదటి నుంచి సీఎం జగన్ స్పష్టంగానే చెప్పారని మంత్రి గుర్తు చేశారు. సీఎం జగన్ నిర్ణయానికి ఎవరూ అతీతులు కాదన్నారు. అంతెందుకు.. అమర్నాథ్ పనితీరు బాగోలేదని భావిస్తే మార్చేస్తారు అని చెప్పారాయన. భవిష్యత్తులో మరికొన్ని మార్పులు ఉంటాయని, ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవడానికైనా వైసీపీ నాయకులు సిద్ధంగా ఉండాల్సిందే అని మంత్రి అమర్నాథ్ తేల్చి చెప్పారు. ఒకవేళ ముఖ్యమంత్రి జగన్ ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వకపోతే వైసీపీ జెండా పట్టుకుని తిరుగుతాం తప్ప మరో ఆలోచన ఉండదని మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.
Also Read : సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీలో భారీ మార్పులు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. జనసేనలో పొలిటికల్ బ్రోకర్ ఉన్నాడని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు. జనసేన అధినేత అజ్ఞాతవాసి అయితే, ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తున్న వ్యక్తి అజ్ఞాని అని విమర్శించారు.
హిందూపురంలో అపెరల్ పార్క్, నెల్లూరులో పవర్ ప్రాజెక్ట్ భూములు వివాదంలో ఉంటే వైసీపీ ప్రభుత్వం పరిష్కరించిందన్నారు. ఇప్పటికీ ఏపీఐఐసీకి చెందిన 12వేల ఎకరాల భూములు న్యాయ వివాదాల్లో ఉన్నాయన్నారు. మరో నెల రోజుల్లో రామాయపట్టణం పోర్టుకు మొదటి వేసల్ రాబోతోందన్నారు. రేపు(డిసెంబర్ 14) ఉత్తరాంధ్రలో సీఎం జగన్ పర్యటించబోతున్నారని మంత్రి అమర్నాథ్ తెలిపారు. 750 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభిస్తారని వెల్లడించారు. పలాసలో కొత్త ఇండస్ట్రీయల్ పార్క్ ను సీఎం జగన్ ప్రారంభించనున్నారు అని తెలియజేశారు.
Also Read : ఏపీ రాజకీయాల్లో సంచలనం..! టీడీపీతో టచ్‌లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న సీఎం జగన్ అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించేశారు. ఈ క్రమంలో వైసీపీలో భారీ మార్పులకు జగన్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కచ్చితంగా పార్టీలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని భావించారు జగన్. ఇటీవలే చేసిన కొన్ని సర్వేల నేపథ్యంలో పార్టీలో మార్పులు చేయాలని డెసిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇందులో భాగంగానే మొత్తం 62 చోట్ల అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలను మార్చాలనే ఒక నిర్ణయానికి జగన్ వచ్చినట్లు సమాచారం. తొలి విడతలో 11 నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ ల మార్పులు చేశారు. ఈ 11 నియోజకవర్గాల్లో మొత్తం నలుగురికి సంబంధించి స్థాన చలనం కలిగించారు. మొత్తం ముగ్గురికి టికెట్ లేదని కన్ ఫర్మ్ చేసేశారు. మిగిలిన చోట్ల కొత్త ఇంఛార్జ్ లను నియమించారు. తొలి విడతలో భాగంగా 11మందికి సంబంధించి మార్పులు చేయగా, రానున్న రోజుల్లో విడతల వారిగా ఈ మార్పులు ఉండబోతున్నాయని సమాచారం. మొత్తం 62 నియోజకవర్గాల్లో ఇంఛార్జ్ ల మార్పులు కచ్చితంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది.