Minister Roja Audio : రోజూ మెంటల్ టెన్షన్ పెడుతున్నారు, రాజకీయాలు చేయలేను.. వైరల్ అవుతున్న మంత్రి రోజా ఆడియో
నగరి వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమున్నాయి. సొంత పార్టీ నేతలే మంత్రి రోజాకు షాక్ ఇచ్చారు. మంత్రి రోజా ఆడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Minister Roja Audio : నగరి వైసీపీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. సొంత పార్టీ నేతలే మంత్రి రోజాకు షాక్ ఇచ్చారు. మంత్రి రోజా ఆడియో ఒకటి వైరల్ అయ్యింది.
అసలేం జరిగిందంటే.. నగరి నియోజకవర్గంలోని కొప్పెడులో రైతు భరోసా కేంద్రానికి రోజా వ్యతిరేక వర్గం భూమి పూజ చేసింది. ఈ కార్యక్రమానికి శ్రీశైలం బోర్డు చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈడిగ కార్పొరేషన్ చైర్మన్ కేజే శాంతి హాజరయ్యారు. దీనిపై మంత్రి రోజా సీరియస్ అయ్యారు. సొంత పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. వారి తీరుని తప్పుపట్టారు.
తనను సంప్రదించకుండా భూమిపూజ చేయడంపై రోజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వాట్సాప్ గ్రూప్ లో వ్యతిరేక వర్గం తీరుని తప్పుపడుతూ ఓ ఆడియో విడుదల చేశారు మంత్రి రోజా. నియోజకవర్గంలో తనను వీక్ చేసే విధంగా వ్యతిరేక వర్గం పని చేస్తోందని ఆమె ఫైర్ అయ్యారు. ఇప్పుడీ ఆడియో వైరల్ గా మారింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
”ఇలాంటి సమయంలో మంత్రి అయిన నన్ను నియోజకవర్గంలో బలహీన పరిచే విధంగా.. తెలుగుదేశం, జనసేన వాళ్లు నవ్వుకునే విధంగా, ఆ పార్టీలకు సపోర్ట్ అవుతూ నాకు, మన పార్టీకి నష్టం జరిగే విధంగా, పార్టీ దిగజారుస్తూ వీళ్లు భూమి పూజ చేయడం ఎంతవరకు కరెక్ట్? మీరంతా ఆలోచించాలి. ఇలాంటి వాళ్లు కంటిన్యూ అయితే, మేము రాజకీయాలు చేయడం చాలా కష్టం. మేము ప్రాణాలు పెట్టి పార్టీ కోసం పని చేస్తుంటే ప్రతి రోజూ మెంటల్ టెన్షన్ పెడుతూ, అన్ని రకాలుగా మాకు, పార్టీకి నష్టం జరుగుతుంటే, వీళ్లు పార్టీ నాయకులు అని చెప్పి ప్రోత్సహించడం కూడా బాధేస్తోంది” అని ఆడియోలో వాపోయారు మంత్రి రోజా.
నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలతో తాను చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నట్టు మంత్రి రోజా పలు సందర్భాల్లో వాపోయారు. నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల్లో వైసీపీలోని ప్రత్యర్థి వర్గం మంత్రి తనకు వ్యతిరేకంగా పని చేస్తోందని రోజా ఆరోపించారు. అయితే, మంత్రి రోజానే తమను ఇబ్బంది పెట్టారని, అందువల్లే తాము వేరు కుంపటి పెట్టుకున్నామని ప్రత్యర్థి వర్గం నేతలు అంటున్నారు.
తాజాగా నియోజకవర్గంలో భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఇది అధికారిక కార్యక్రమం. రోజా ఒక నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పైగా మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఆమెను ఈ కార్యక్రమానికి ఆహ్వానించ లేదు. దీంతో రోజా బాగా ఫీల్ అయ్యారు. కనీసం తనకు సమాచారం కూడా ఇవ్వకుండా కార్యక్రమం ఎలా నిర్వహిస్తారని రోజా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఆమె బాహాటంగా విమర్శలు చేయకపోయినా.. పార్టీ వాట్సాప్ గ్రూప్ లో రోజా తన బాధను వ్యక్తం చేస్తూ ఆడియోని రిలీజ్ చేశారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు రోజా. టీడీపీ, జనసేన వాళ్లు తనను మరింత అవహేళన చేసేందుకు ఇలాంటి చర్యలు దోహదపడతాయని వాపోయారు. మీరు మారకపోతే, ఇలాంటి ధోరణి కొనసాగితే ఇక రాజకీయాలు చేయలేను అని సీరియస్ కామెంట్స్ చేశారు రోజా. తనను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా నగరి వైసీపీలో విభేదాలు మరోసారి బహిర్గతం అయ్యాయి.