గోవిందా.. గోవిందా… టీటీడీ గుళ్ళో రూ.4 కోట్లు కొట్టేసిన ఇంటిదొంగలు

కలియుగ ప్రత్యక్ష దైవం కొలువై ఉన్న ప్రాంతంలోనే అక్రమాలు జరుగుతున్నాయి. ఆయన ఆలయాలే అవినీతికి కేంద్రాలుగా మారుతున్నాయి. తిరుమలలో ఇప్పటికే అనేక ఆరోపణలు రాగా.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో.. దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటు చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో రూ.4 కోట్ల మేర భారీగా నిధులు గోల్‌మాల్ అయ్యాయి. ఓ భక్తుడు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయడంతో ఆలయంలో జరిగిన అవినీతి బయటకు వచ్చింది.
తిరుమల ఏడుకొండల్లో నెలకొన్న స్వామివారిని ఉత్తరాది వారికి దగ్గర చేసే ఉద్దేశంతో దేశ రాజధాని ఢిల్లీలో వెంకటేశ్వరస్వామి గుడిని దాతల సాయంతో టీటీడీ ఏర్పాటు చేసింది. ఆలయ నిర్వహణ కోసం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ర్యాంక్ అధికారిని, మరికొంత మంది సిబ్బందిని, నిత్య పూజల కోసం పూజారులను నియమించింది. ప్రతిరోజు పూజాది కార్యక్రమాలతో పాటు పర్వదినాలు, పండుగల రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. అయితే నిత్య పూజ కోసం వినియోగించే పూల నుంచి ప్రసాదం, ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ వరకు అన్ని విషయాల్లోనూ అధికారులు చేతివాటం ప్రదర్శించారు.
పూలతో మొదలుకొని పూజా సామాగ్రి సప్లై చేసే కాంట్రాక్టర్ల నుంచి అధికారులు నెలవారీ ముడుపులు తీసుకుంటున్నట్టు ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. ఆలయానికి దాతలు అందచేసిన వాహనం విషయంలోనూ భారీ ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపించాడు. ముందుగా టీటీడీ పాలకమండలికి ఫిర్యాదు చేయగా.. వారు టీటీడీ విజిలెన్స్ విభాగానికి దర్యాప్తు చేయాల్సిందిగా సూచించారు. అయితే ఢిల్లీలోని దేవాలయం ఏపీ రెసిడెంట్ కమిషనర్ పర్యవేక్షణలో ఉన్నందున, ఆయన జోక్యంతో విచారణ ముందుకు సాగలేదు. దీంతో ఆగ్రహించిన భక్తుడు నేరుగా ప్రభుత్వ ప్రత్యేక ప్రతినధి విజయసాయిరెడ్డిని కలిసి జరుగుతున్న అక్రమాలను ఆధారాలతో సహా వివరించాడు. దీంతో ఆయన టీటీడీతో ప్రమేయం లేకుండా రాష్ర్ట ప్రభుత్వ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగానికి బాధ్యత అప్పగించారు. ఆలయంలోని అక్రమాలను వెలికితీయాలని ఆదేశించారు. ఈమేరకు ఇన్‌స్పెక్టర్ ర్యాంక్ అధికారి ఢిల్లీ చేరుకుని రెండ్రోజులుగా ఏఈఓ ఆఫీస్‌లో ఫైళ్లను తనిఖీ చేస్తున్నారు.