TDP: కార్యకర్తల్లో కొత్త జోష్… టీడీపీ స్ట్రాటజీ అదుర్స్..
ఏమైనా గత అనుభవం నేర్పిన పాఠంతో.. ఇప్పుడు ఆచీతూచీ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఆవిర్భావ దినోత్సవ వేళ.. పసుపు శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. కార్యకర్తల్లో ఒకడిని.. కార్యకర్తలకు ఒకడిని.. ఒక కార్యకర్తను అన్నట్లుగా.. చంద్రబాబు, లోకేశ్ ఇస్తున్న ధైర్యం.. ఆ ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. టీడీపీకి మూల బలం కార్యకర్తల అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐతే అలాంటి కేడర్‌ను కాపాడుకుంటూ.. మరింత జోష్ నింపేలా టీడీపీ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయ్. గత అనుభవాల్లోంటి టీడీపీ పాఠాలు నేర్చుకుందా.. ఏ చిన్న పొరపాటు కూడా జరగొద్దని డిసైడ్ అయిందా.. చంద్రబాబు, లోకేశ్ మాటలపై జరుగుతున్న చర్చ ఏంటి?
టీడీపీది 43ఏళ్ల ప్రస్థానం.. సంక్షోభాలను అవకాశాలుగా మలచుకుని శక్తిమంతంగా మారిన ప్రాంతీయ పార్టీగా ఎదిగింది. 43ఏళ్ల ప్రస్థానంలో ఎన్నెన్నో ఆటుపోట్లు.. అయినా రాటుదేలి జాతీయ రాజకీయాల్లో కీలక శక్తిగా మారింది. జాతీయ రాజకీయాలను కూడా నడిపించే స్థాయికి ఎదిగింది. పార్టీ కోసం, నమ్మిన సిద్ధాంతం కోసం.. కష్టపడి పనిచేసే కరుడుకట్టిన కార్యకర్తలే ఈ బలానికి
కారణం అనడంలో ఎలాంటి అనుమానం లేదు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ పగ్గాలు అందుకున్న చంద్రబాబు.. అభివృద్ధి దిశగా మాత్రమే ఆలోచించడం మొదలుపెట్టారు. పార్టీని లైట్ తీసుకున్నారు. పార్టీ నేతలు చెప్పేది కూడా ఇదే ! దీనివల్లే గ్రౌండ్ లెవల్‌లో పార్టీ ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఐతే ఇప్పుడు ఆ పరిస్థితి రావొద్దని.. వచ్చే పరిస్థితి కూడా తీసుకురావద్దని.. టీడీపీ పెద్దలు స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయినట్లు కనిపిస్తున్నారు. మీకోసం, మీవెంటే అన్నట్లుగా కార్యకర్తల మీద చంద్రబాబు, లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయ్.
పార్టీకి మనమంతా వారసులమే అంటూ..
తెలుగువారు ఉన్నంతవరకూ టీడీపీ శాశ్వతంగా ఉంటుందని.. పార్టీకి మనమంతా వారసులమే కానీ పెత్తందారులం కాదంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. కార్యకర్తల్లో కొత్త జోష్ నింపుతున్నాయ్. పార్టీనే ప్రాణంగా బతికే పసుపు సైన్యానికి.. చంద్రబాబు పాదాభివందనం తెలిపారు. కార్యకర్తలు హుషారుగా ఉంటే.. టీడీపీకి తిరుగేలేదని.. కార్యకర్తల్లో హుషారు తగ్గినప్పుడే విపక్షం పుంజుకునే ప్రయత్నం చేస్తుందంటూ కీలక సూచనలు చేశారు. ప్రతీ కార్యకర్తకు తప్పనిసరిగా గుర్తింపు ఇస్తామని.. ఆవిర్భావ దినోత్సవం వేదికగా హామీ ఇచ్చారు. జనాల చుట్టూ తిరిగే కార్యకర్తలకు, కార్యకర్తల చుట్టూ తిరిగే నాయకులకు పార్టీ అండగా ఉంటుందని ప్రామిస్ చేశారు.
చంద్రబాబు కార్యకర్తల కోసం మాట్లాడుతుంటే.. లోకేశ్ కార్యకర్తల తరఫున మాట్లాడుతున్నారనిపిస్తోంది. ఎన్ని కష్టాలు వచ్చినా ఎత్తిన జెండా దించకుండా నిల్చున్న పసుపు సైన్యానికి హ్యాట్సాఫ్ అన్న లోకేశ్.. నామినేషన్ పత్రాలు లాగేసుకుంటే తొడగొట్టి మీసం మెలేసిన అంజిరెడ్డి.. కత్తివేటు పడి రక్తం కారుతున్నా పోలింగ్ బూత్ వదలని మంజులారెడ్డి పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించారు. కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపే ప్రయత్నం చేశారు.
కార్యకర్తల కోసం తాను బయట ఎంత పోరాడతానో.. పార్టీలోనూ అంతే పోరాడతానని లోకేష్ అన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు, నాయకులను గుర్తించడమే తన టార్గెట్ అంటూ కొత్త జోష్ ఇచ్చారు. త్వరలనే అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నామని చెప్పారు. ఇక రెడ్‌బుక్ గురించి ప్రస్తావించినప్పుడు కార్యకర్తల్లో కనిపించిన ఊపు అంతా ఇంతా కాదు. అధికారంలో ఉన్నామన్న గర్వం వద్దని.. అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.
అటు చంద్రబాబు అయినా.. ఇటు లోకేశ్ అయినా.. కార్యకర్తల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం చేశారు. నిజానికి 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు.. రాష్ట్ర అభివృద్ధి మీద మాత్రమే చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు కనిపించారు. కార్యకర్తల విషయంలో లైట్ తీసుకున్నట్లు అనిపించారు. దీంతో ఐదేళ్లు తిరిగేసరికి సీన్ రివర్స్ అయింది. ఐతే ఇప్పుడు మాత్రం అలాంటి పొరపాటు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
రాష్ట్రం బాధ్యత తాను చూసుకుంటూ.. పార్టీ బాధ్యతలు లోకేశ్‌కు అప్పగించారేమో అనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే! కార్యకర్తల కోసం పార్టీతోనూ పోరాడతానంటూ లోకేశ్ మాట్లాడిన మాటలు.. దీనికి నిదర్శనంగా కనిపిస్తున్నాయ్. ఏమైనా గత అనుభవం నేర్పిన పాఠంతో.. ఇప్పుడు ఆచీతూచీ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఇక అటు కార్యకర్తలకు ఉగాది గిఫ్ట్ కూడా టీడీపీ సిద్ధం చేసింది. ఇప్పటికే 47 మార్కెట్ కమిటీలకు ఛైర్మన్లను ప్రకటించింది. సభ్యులతో కలిపి త్వలో 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేయబోతోంది. ఇలా కనిపెడుతున్నాం.. కాపాడుకుంటాం.. గుర్తిస్తాం.. గుండెల్లో పెట్టుకుంటాం అన్నట్లుగా కార్యకర్తలకు టీడీపీ పెద్దలు సందేశాలు పంపిస్తున్నట్లు అనిపిస్తుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయ్.