కృష్ణ.. కృష్ణా.. ఎన్టీఆర్ సొంత జిల్లాలో గడ్డు పరిస్థితిలో తెలుగుదేశం, దీనికి కారణం చంద్రబాబేనట

krishna district tdp: తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కృష్ణా జిల్లాలో బలమైన కేడర్ ఉంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ సొంత జిల్లా కావడంతో మొదటి నుంచి ఇక్కడ ఆ పార్టీ యాక్టివ్‌గా ఉండేది. గతంలో జిల్లా నేతలంతా ఐకమత్యంగా పని చేసి అద్భుత విజయాలు సాధించారు. పార్టీ ఓటమి చెందిన సందర్భాల్లో కూడా కేడర్ గానీ నేతలు గానీ చెక్కు చెదరలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి ఇందుకు భిన్నంగా కనిపిస్తోందంటున్నారు. జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాల్లో రెండు స్థానాలు మాత్రమే మొన్నటి ఎన్నికల్లో పార్టీ గెలిచింది. అలాగే ఒక ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకుంది.
గతంలో మాదిరి కనిపించని సమన్వయం:
గన్నవరంలో గెలిచిన వల్లభనేని వంశీ అధికార పార్టీ మద్దతుదారుడిగా మారిపోయారు. ప్రస్తుతానికి విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, ఎంపీగా కేశినేని నాని మాత్రమే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. జిల్లా టీడీపీ నేతల మధ్య అంతకు ముందున్న సమన్వయం నేడు కనిపించడం లేదంటున్నారు. మొన్ననే విజయవాడ పార్లమెంటు, బందరు పార్లమెంట్ నియోజకవర్గాలకి వేర్వేరుగా కమిటీలు వేశారు. మాజీ మంత్రి నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణలకు బాధ్యతలు అప్పగించారు. పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్‌బ్యూరోలో కూడా కృష్ణా జిల్లా నుంచి ఎనిమిది మందికి అవకాశం కల్పించారు.
ఎంతమందికి పదవులిచ్చినా ప్రయోజనం లేదు:
త్వరలో ప్రకటించబోయే ఏపీ రాష్ట్ర కమిటీలో కూడా కృష్ణా జిల్లా నుంచి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అధినేత చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. ఎంతమందికి పదవులిచ్చినా కలసి ముందుకు సాగే పరిస్థితులు మాత్రం లేవని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ కేంద్ర కమిటీలో వర్ల రామయ్య, బోండా ఉమా, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, బచ్చుల అర్జునుడు, అశోక్‌బాబు, పట్టాభి, శ్రీరామ్ తాతయ్యలకు అవకాశం కల్పించారు. మరి కొంతమంది జిల్లా నేతలు మాత్రం కేంద్ర కమిటీలో అవకాశం దక్కలేదని కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. వీరిలో ఎవరూ కూడా కలిసి పని చేసే పరిస్థితి లేదంటున్నారు.
నాని రూటే సెపరేటు, కేంద్ర కార్యాలయానికే వర్ల పరిమితం:
విజయవాడ సిటీలో గద్దె రామ్మోహన్ కొంత యాక్టివ్‌గా పని చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమా ఒక్కరే ఎవరు కలసి వచ్చినా రాకపోయినా పార్టీ పిలుపు మేరకు అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఎంపీ కేశినేని దారే వేరు. ఆయనకు ఎలా అనిపిస్తే అలా ముందుకెళ్తుంటారు. ఆయన కోరిక మేరకే నెట్టెం రఘరామ్‌కి విజయవాడ పార్లమెంట్ అధ్యక్ష పదవి ఇచ్చారని పార్టీలో టాక్. అయినా ఎంపీ ఇంకా యాక్టివ్‌గా పని చేయడం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వర్ల రామయ్య పార్టీ కేంద్ర కార్యాలయానికి పరిమితం అవుతున్నారు.
వైసీపీ నేతల అక్రమాలు, అవినీతిని ఎత్తి చూపడంలో విఫలం:
అధికార పార్టీకి చెందిన మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. గత టీడీపీ హయాంలో జరిగిన వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు తెర మీదకు తెచ్చి ఆ పార్టీ జిల్లా నేతలను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్లైఓవర్ విషయంలో టీడీపీ హయాంలోనే చాలావరకు పనులు పూర్తయినా అది చెప్పుకోవడంలో విఫలం అయ్యారని తెలుగు తమ్ముళ్ళ ఫీలింగ్. పార్టీ నేతలంతా ఎంతసేపూ రాష్ట్ర స్థాయి అంశాలను ప్రస్తావిస్తూ పైపైన మాట్లాడి పని ముగించుకుని వెళ్తున్నారని అంటున్నారు. జిల్లాస్థాయి వైసీపీ నేతల అక్రమాలు, అవినీతిని ఎత్తి చూపలేక పోతున్నారని టాక్.
ఐదారు నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన చోట్ల యాక్టివ్‌గా లేరు:
జిల్లాలో ఐదారు నియోజకవర్గాల్లో తప్ప మిగిలిన చోట్ల నేతలు యాక్టివ్‌గా లేరని అధిష్టానం గుర్తించిందని అంటున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ఎవరు బాధ్యులో కూడా తెలియని పరిస్థితి ఉంది. మొన్నటి ఎన్నికల్లో జలీల్ ఖాన్ కుమార్తె షబానా ఖాతూన్ పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ బుద్ధా వెంకన్న, నాగుల్ మీరాలు ఎవరికివారే యమునా తీరే అన్నట్లు పని చేస్తున్నారు. తిరువూరులోనూ అదే పరిస్థితి. జవహర్ కొవ్వూరుకు వెళ్లిపోవడంతో ప్రస్తుతానికి స్వామిదాస్ లైన్‌లోకి వచ్చారు. చివర వరకు ఆయనను ఉంచుతారో లేదో అనుమానమే.
ఆ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి నిరాశాజనకం:
గన్నవరానికి మొన్ననే బచ్చుల అర్జునుడుని ఇన్‌చార్జిగా ప్రకటించారు. అవనిగడ్డలో బుద్ధ ప్రసాద్ రాజకీయాలకు దూరంగా ఉంటూ కుమారుడికి బాధ్యతలు అప్పగించారు. నూజివీడులో ముద్రబోయిన వెంకటేశ్వరరావు యాక్టివ్‌గా లేరని సమాచారం. పెడనలో కాగిత కృష్ణప్రసాద్ సైతం నివాసానికే పరిమితమైపోయారట. పామర్రులో ఉప్పులేటి కల్పన కనిపించడం లేదని కేడర్ మొత్తుకుంటోంది. నూజివీడు, కైకలూరు, పెడన అవనిగడ్డ, గన్నవరం, విజయవాడ పశ్చిమ, పామర్రు, తిరువూరు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఆశాజనకంగా లేదని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు.
జిల్లా స్థాయి అంశాలపై మాట్లాడితే హోదా తగ్గిపోతుందనే ఫీలింగ్:
కృష్ణా జిల్లాలో సీనియర్ నేతలు అందరినీ కేంద్ర కమిటీలోకి తీసుకోవడంతో జిల్లాలో వైసీపీని టార్గెట్ చేసి మాట్లాడే నేతలే కరవయ్యారనేది కార్యకర్తల వాదన. జిల్లా స్థాయి అంశాలపై మాట్లాడితే తమ హోదా తగ్గిపోతుందనే భావనలో సీనియర్లు ఉన్నారని టాక్. మరికొందరు మాత్రం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన నాయకులేమయ్యారంటూ దెప్పి పొడుస్తున్నారట. జిల్లా స్థాయిలో అధికార పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను టార్గెట్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందగలమని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం పార్లమెంట్ నియోజకవర్గాల అధ్యక్షులిద్దరూ వయసు రీత్యా యాక్టివ్‌గా పని చేయలేకపోతున్నారనీ ఒకరికొకరు చెప్పుకుంటూ తమ్ముళ్లు తెగ ఫీలైపోతున్నారు. ఈ విషయంలో అధినేత ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందే అంటున్నారు.