చంద్రబాబుతో తీవ్ర విబేధాలున్నా, అనేకసార్లు అన్యాయం చేసినా పార్టీని వీడనంటున్న సీనియర్ లీడర్

రాజకీయాల్లో ఆయన శైలే వేరు. వయసు 75 అయినా ఇప్పటికీ అదే స్పీడ్. ప్రత్యర్థులను తన మాటల చాతుర్యంతో హడలెత్తిస్తారు. పార్టీ గాలి వీచినప్పుడు మాత్రమే గెలుస్తారనే పేరున్న ఆయన ఈసారి మాత్రం ప్రత్యర్థి పార్టీ వేవ్ లోనూ గెలిచారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అధికార పార్టీ నేతలను టార్గెట్ చేస్తూ దూకుడుగా ముందుకుపోతున్నారు. సొంత పార్టీ ఎన్నిసార్లు అన్యాయం చేసినా, పార్టీకి విధేయుడిగానే వ్యవహరించడం ఆయన నైజం.
సొంత అల్లుడు చంద్రబాబు కన్నా బుచ్చయ్యకే ఎన్టీఆర్ ప్రాధాన్యం:
గోరంట్ల బుచ్చయ్య చౌదరి అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఎన్టీఆర్ ప్రియ శిష్యుడిగా రాజకీయ అరంగేట్రం చేసి తనకంటూ ఒక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లో ప్రవేశించి ఆయన కేబినెట్‌లో పౌరసరఫరాల శాఖ మంత్రిగా కూడా పని చేశారు. ఎన్టీఆర్ చనిపోయే వరకు ఆయనతోనే ఉన్నారు. సొంత అల్లుడు చంద్రబాబు కన్నా బుచ్చయ్యకే ప్రాధాన్యం ఇచ్చేవారు ఎన్టీఆర్. లక్ష్మీపార్వతి వర్గంగా ఉంటూ చంద్రబాబును సైతం ఢీకొట్టారు బుచ్చయ్య. ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్న బుచ్చయ్య అప్పట్లో వివాదాలకు కేంద్రంగా ఉండేవారు.
రాజకీయ జీవితంలో చిన్న అవినీతి ఆరోపణ కూడా లేదు:
గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజమండ్రి సిటీ నుంచి నాలుగు సార్లు, రూరల్ నుంచి రెండుసార్లు ఎన్నికయ్యారు. టీడీపీలోని గ్రూపు రాజకీయాల్లో భాగంగా అనేక సార్లు బుచ్చయ్య చౌదరికి పదవులు దూరమయ్యాయి. చంద్రబాబుతో తీవ్ర విభేదాలు ఉన్నప్పటికీ పార్టీ అంతర్గత వేదికల మీద మాత్రమే తన వాదన వినిపించే వారు. ఎక్కడా పార్టీకి నష్టం కలిగేలా బహిరంగ వేదికపై మాట్లాడేవారు కాదు. తన రాజకీయ జీవితంలో చిన్న అవినీతి ఆరోపణలు కూడా ఎప్పుడు ఎదుర్కోలేదు. తూర్పు గోదావరి జిల్లా కుల సమీకరణలో భాగంగా తనకు పదవులు దూరం అయ్యాయని భావిస్తుంటారాయన.
మొదట్నుంచి చంద్రబాబు నమ్మేవారు కాదు:
ఏ అంశం మీదైనా సరే ముక్కుసూటిగా, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే తత్వం బుచ్చయ్య చౌదరిది. దీని వల్లే ఆయన రాజకీయంగా నష్టపోయారని చెప్పుకుంటారు తెలుగు తమ్ముళ్ళు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం చంద్రబాబుతో విభేదాలు ఉన్నాయని, బుచ్చయ్య చౌదరి అధికార వైసీపీలోకి జంప్ అవ్వడం ఖాయమని అందరూ అనుకున్నారు. అధికార పార్టీలోని కొందరు పెద్దలు కూడా బుచ్చయ్యను టచ్ చేసి చూశారట. అధినేతతో ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ కన్నతల్లి లాంటి పార్టీని వీడి రాలేనని వారిపైన ఆగ్రహం వ్యక్తం చేశారట. మొదటి నుంచి బుచ్చయ్యను చంద్రబాబు అంతగా నమ్మేవారు కాదట.
మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబుని వేడుకున్నా ఫలితం లేకపోయిందట:
2014లో టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే ఆఖరి సారి. ఇక అసెంబ్లీకి పోటీ చేయనని, మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబుని వేడుకున్నా ఫలితం లేకపోయిందంట. దీంతో మనస్తాపం చెంది పార్టీకి రాజీనామా కూడా చేసి, మళ్లీ విరమించుకున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు బుచ్చయ్య చౌదరి. పదవులు అనుభవించిన వారందరూ పలాయనం చిత్తగిస్తే చివరికి అధికార పార్టీపై పోరాటానికి బుచ్చయ్య ఒక్కరే దిక్కయ్యారని తెలుగు తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి పదవులిచ్చే కంటే బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్స్‌ను గౌరవించాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.