జగన్ మనిషినంటున్న త్రిమూర్తులు!

అధికారంలో ఉన్న పార్టీలో విభేదాలు కామన్. అందులోనూ ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవి మరింత ఎక్కువే. ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి .. ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి గ్యాప్ లేకుండా జంపింగులు చేస్తున్నప్పుడు అసంతృప్తులు, వర్గాలు మరీ ఎక్కువ. ఇప్పుడు వైసీపీలో ఆ పరిస్థితులే ఉన్నాయని పార్టీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీలోకి టీడీపీతో పాటు ఇతర పార్టీల నుంచి దిగ్గజ నేతలు చాలా మందే చేరిపోయారు. అధికారానికి దూరంగా ఉండలేని నేతల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.
ఎన్నికల్లో ఒక పార్టీ తరఫున పోటీ చేసి, ఓడిపోయిన తర్వాత కనీసం ఆ పార్టీ అధికారంలో ఉంటే పర్లేదు. అలాంటి సమయంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా గెలవకపోయినా అదే పార్టీలో కొనసాగిపోతారు. ఎందుకంటే అధికారాన్ని అనుభవించ వచ్చు కాబట్టి. కానీ, వేరే పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం ఇక్కడ ఉండలేని పరిస్థితి. మొన్నటి ఎన్నికల తర్వాత నుంచి జరుగుతున్న తంతు ఇదే. టీడీపీ నుంచి పెద్ద సంఖ్యలో నేతలు వైసీపీలో చేరుతున్నారు. ఇప్పుడు ఆ చేరికలను తట్టుకోలేని క్షేత్రస్థాయిలోని వైసీపీ సానుభూతిపరులు, కార్యకర్తలు తట్టుకోలేకపోతున్నారు.
తోట త్రిముర్తులకు చేదు అనుభవం :
తాజాగా వైసీపీలో చేరేందుకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి మోపిదేవితో పాటు కలిసి ద్రాక్షారామం వచ్చిన మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నేత తోట త్రిమూర్తులుకు చేదు అనుభవం ఎదురైంది. వైవీ సుబ్బారెడ్డి ముందే తోట త్రిముర్తులును ఇజ్రాయెల్ అనే వైసీపీ నేత దాడి చేసేందుకు ప్రయత్నించడం కలకలరం రేపింది. చాలా ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే ఉన్నప్పటికీ బయటపడడం లేదు. ఇక్కడ మాత్రం బయటపడింది. ఇజ్రాయెల్ స్థానిక ఎమ్మెల్యే వేణు వర్గానికి చెందిన నాయకుడు అంట. టీడీపీ నుంచి త్రిమూర్తులు వైసీపీలో చేరితే వైసీపీ ఎమ్మెల్యే వేణు భవిష్యత్తుకు ఇబ్బంది అని భావిస్తున్నారు. అందుకే త్రిమూర్తులను చేరికను అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారట.
వైవీ సుబ్బారెడ్డి, మోపిదేవి సమక్షంలోనే పార్టీలో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది బయటపెడితే ఫలితం ఉంటుందని అనుకుంటున్నారట. అందుకే వారి ముందే దాడికి ప్రయత్నించారని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఆ తర్వాత ఇజ్రాయెల్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. కాకపోతే ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలని వైసీపీ హైకమాండ్ ఆదేశిస్తోందని అంటున్నారు. దీని వల్ల పార్టీ పరువు రోడ్డెక్కుతుందని భావిస్తున్నారు. కానీ, ఈ పరిస్థితులు మారే అవకాశాలు లేవని కార్యకర్తలు అనుకుంటున్నారు.