తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు

Tirupati Parliament by-elections : ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో జగనున్న ఈ బై ఎలక్షన్‌ను ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇప్పటికే తిరుపతిలో పోటీ చేస్తామంటూ బీజేపీ ప్రకటించేసింది. ఇక సోమవారం టీడీపీ కూడా పోటీ సై అంటూ ప్రకటన చేసింది. ఇక వైసీపీ నుంచి కూడా ప్రకటన వస్తే… తిరుపతి ఉప ఎన్నిక పోరు హోరెత్తనుంది.
తిరుపతి ఎంపీ బల్లి దుర్గా ప్రసాద్ అనారోగ్యంతో కొద్ది రోజుల క్రితం చనిపోయారు. దీంతో ఈ స్థానానికి త్వరలో ఉప ఎన్నిక జరుగనుంది.ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. తిరుపతి లోక్‌సభ నియోజకవర్గ పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్థిని బరిలో నిలపడంతోపాటు గెలుపు వ్యూహాలపై చర్చించారు. టీడీపీ అభ్యర్థిగా మాజీ కేంద్రమంత్రి పనబాక లక్ష్మి పేరును ప్రకటించారు. అభ్యర్థి విజయం కోసం పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక వైసీపీ ఓటమికి వేదికగా నిలవాలని, వైసీపీ అరాచకాలకు ఇక్కడి నుంచే అడ్డుకట్ట పడాలని అన్నారు.
తిరుపతి పార్లమెంట్ పరిధిలోకి వచ్చే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా టీడీపీ ఎమ్మెల్యే లేరు. ఇలాంటి చోట ఉప ఎన్నిక అనుకున్నంతా ఈజీ అయితే కాదు. తిరుపతి పార్లమెంట్ స్థానంలో టీడీపీ గెలిచి కూడా చాలా కాలమైంది. అయినప్పటికీ ఉప ఎన్నిక విషయంలో ప్రతిపక్షం గట్టి నిర్ణయమే తీసుకుంది.
https://10tv.in/tirupati-ls-bypoll-tdp-chief-chandrababu-announces-tdp-candidate-for-tirupati-constituency/
పనబాక లక్ష్మి గతంలో నెల్లూరు నుంచి రెండుసార్లు, బాపట్ల నుంచి ఒకసారి మొత్తంగా మూడుసార్లు ఆమె ఎంపీగా ఎన్నికయ్యారు. యూపీఏ హయాంలో 10సంవత్సరాలు కేంద్రమంత్రిగా పనిచేశారు. కేంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, జౌళి తదితర శాఖలను ఆమె నిర్వర్తించారు. కాంగ్రెస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన పనబాక లక్ష్మీ… ఏపీలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో 2019లో టీడీపీలో చేశారు. తిరుపతి నుంచి ఎంపీగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. దీంతో మరోసారి చంద్రబాబు ఆమెకే అవకాశం కల్పించారు.
దుబ్బాక ఉప ఎన్నిక ఇచ్చిన కిక్‌తో బీజేపీ కూడా తిరుపతి పార్లమెంట్ స్థానంపై ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఆ పార్టీ పోటీ చేస్తామంటూ ప్రకటించేసింది. ఇటీవలే ఏపీ బీజేపీ అగ్రనేతలు తిరుపతిలో మంతనాలు కూడా జరిపారు. ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కూడా అభ్యర్థిని ప్రకటించి పోటీకి రెడీ అన్న సంకేతాలు పంపింది. వైసీపీ అభ్యర్థి ఎవరన్నది త్వరలో తేలనుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవడానికి వైసీపీ కూడా తెరవెనుక ప్రయత్నాలు నడుపుతున్నట్టు సమాచారం. దీంతో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక పోరు హోరాహోరీగా సాగనుంది.