Tirupati Goshala: టీటీడీ గోశాలపై రాజకీయ రగడ.. రోడ్డుపై పడుకొని భూమన నిరసన.. గోశాలలో కూటమి ఎమ్మెల్యేలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లు

వైసీపీ నేతలు వర్సెస్ కూటమి నేతల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య తిరుమలలో హైటెన్షన్ నెలకొంది. గోశాలలో ఆవుల మృతిపై రాజకీయం వేడెక్కింది.

Tirupati Goshala: టీటీడీ గోశాలపై రాజకీయ రగడ.. రోడ్డుపై పడుకొని భూమన నిరసన.. గోశాలలో కూటమి ఎమ్మెల్యేలు.. సవాళ్లు, ప్రతిసవాళ్లు

Tirupati goshala controversy

Updated On : April 17, 2025 / 2:52 PM IST

Tirupati Goshala Controversy: తిరుమలలో హైటెన్షన్ నెలకొంది. గోశాలలో ఆవుల మృతిపై రాజకీయం వేడెక్కింది. టీటీడీ నిర్లక్ష్యంతోనే గోశాలలో ఆవులు చనిపోతున్నాయని వైసీపీ నేతలు ఆరోపిస్తుంటే.. అనారోగ్యంతోనే చనిపోతున్నాయని అధికారపక్షం నేతలు చెబుతున్నారు. గోశాలకు వెళ్తామని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మరోవైపు కూటమి నేతలు పరస్పరం సవాళ్లు విసురుకున్న నేపథ్యంలో పోలీసులు కల్పించుకొని భారీ సంఖ్యలో కార్యకర్తలు లేకుండా కేవలం గన్ మెన్లు, వ్యక్తిగత భద్రతా సిబ్బందితోనే వెళ్లాలని సూచించారు.

 

ఈ క్రమంలో గురువారం ఉదయం వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి తన నివాసం నుంచి ఎంపీ గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామితో కలిసి ఎస్వీ గోశాలకు బయలుదేరారు. భారీ సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు రావడంతో భూమన కరుణారెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భూమన, వైసీపీ నేతలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మరోవైపు కూటమి ఎమ్మెల్యేలు పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి, ఆరణి శ్రీనివాసులతో పాటు టీటీడీ సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి తదితరులు గురువారం ఉదయం గోశాల వద్దకు వెళ్లారు. ఎస్వీ గోశాలపై వైసీపీ నేతల ఆరోపణలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని విమర్శించారు. అసత్య ఆరోపణలు మానుకోవాలని హితవుపలికారు. వైసీపీ హయాంలో టీటీడీలో ఎన్నో అక్రమాలు జరిగాయన్నారు.

 

అనంతరం గోశాల నుంచే భూమున కరుణాకర్ రెడ్డికి కూటమి నేతలు ఫోన్ చేశారు. అసత్య ఆరోపణలు చేయడం కాదని, క్షేత్ర స్థాయికి రావాలని కోరారు. పోలీసుల సూచనల మేరకు ఐదుగురితో గోశాల వద్దకు రావాలని కోరారు. ఎమ్మెల్యేల ఫోన్ నేపథ్యంలో గోశాలకు వస్తానని భూమన తెలిపారు. అయితే, వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు భూమనను అడ్డుకున్నారు. టీడీపీ నేతల ఛాలెంజీపై తాను స్పందించానని, తనను రమ్మని వాళ్లే నిర్బంధించడం ఎంత వరకు న్యాయమని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు.

 

టీడీపీ నేతలు గోశాల వద్ద ఉన్నప్పుడే నన్ను అనుమతించాలని, తాను ఒక్కడినే రావడానికి సిద్ధమని.. టీడీపీ నేతలు వెళ్లిపోయాక అనుమతిస్తే ఏం ఉపయోగమని అన్నారు. పోలీసుల బలగాలతో నిర్బంధించడం దారుణమన్నారు. ఎస్వీ గోశాలలో 170 గోవులు ఎందుకు మృత్యువాతపడ్డాయి..? 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు 176 ఆవులు మరణించాయని అధికారులే చెబుతున్నారు. గోవుల మృతిపై ఈవో, చైర్మన్, ఎమ్మెల్యే వ్యాఖ్యలకు పొంతనలేదని భూమన విమర్శించారు. ఇదిలాఉంటే.. ఎస్వీ గోశాల వద్దకు వైసీపీ ఎంపీ గురుమూర్తి చేరుకున్నారు. గోశాలకు రాకుండా భూమన కరుణాకర్ రెడ్డిని అడ్డుకున్నారని, వేరే దారిలో నేను గోశాలకు వచ్చానని చెప్పారు. నిజాన్ని నిరూపించడానికి మేము సిద్ధమని అన్నారు.

గోశాల గొడవేంటి..?
వైసీపీ నేత, మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. గత మూడు నెలల్లో గోశాలలో వందకుపైగా గోవులు మరణించాయని ఆరోపించారు. గోశాలలో నిర్వహణ లోపాలు, గోవులకు సరియైన ఆహారం, వైద్య సంరక్షణ లేకపోవటం వల్లనే ఈ మరణాలు సంభవించాయని ఆరోపించారు. ఈ మరణాలకు ఎన్డీయే కూటమి ప్రభుత్వం, టీటీడీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. భూమన ఆరోపణలను టీటీడీ ఖండించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చనిపోయిన గోవుల ఫొటోలు టీటీడీ గోశాలకు సంబంధించినవి కావని స్పష్టం చేసింది. టీటీడీ ఛైర్మన్ బీ.ఆర్. నాయుడు, బోర్డు సభ్యుడు జి. భానుప్రకాష్ రెడ్డి గోశాలను సందర్శించి, గోవులకు సరైన ఆహారం, వైద్య సదుపాయాలు అందుతున్నాయని తెలిపారు. అప్పటి నుంచి వైసీపీ, కూటమి నేతల మధ్య గోశాల రాజకీయం రోజురోజుకు తీవ్రమవుతోంది.