TTD : అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు.. ఉచితంగా స్థలం కేటాయించాలంటూ ముఖ్యమంత్రులకు టీటీడీ ఛైర్మన్ లేఖ
దాదాపు 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు.

TTD : దేశంలోని అన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా స్థలం కేటాయించాలంటూ తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బీఆర్ నాయుడు లేఖ రాశారు. దేవాలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలు కాదని, సమాజ అభివృద్ధికి దోహదపడతాయని ఆయన తెలిపారు. దేశాభివృద్ధిలో టెంపుల్ టూరిజం ప్రత్యేక పాత్ర పోషిస్తుందని లేఖలో పేర్కొన్నారు బీఆర్ నాయుడు.
దాదాపు 14 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. ఆయా రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలం కేటాయించాలని ఆయన లేఖలో కోరారు. లేఖలను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు పంపించారు.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో శ్రీవారి ఆలయాలు, సమాచార కేంద్రాలు ఉన్నాయి. అదే తరహాలో భారీ ఎత్తున అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు, సమాచార కేంద్రాలు, ఇతర సౌకర్యాలతో కూడిన ఆలయాలు నిర్మించాలని టీటీడీ భావించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలోనే దీనిపై టీటీడీకి సూచన చేశారు. ఆయన ఆదేశాల మేరకు మంగళవారం టీటీడీ ఛైర్మన్ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఉత్తరాలు రాశారు.
దేశ పురోగతిలో టెంపుల్ టూరిజం గణనీయమైన పాత్ర పోషిస్తుంది. లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది. ప్రతి రాష్ట్ర రాజధానిలో శ్రీవారి ఆలయాలను స్థాపించడం వల్ల సాంస్కృతిక వారసత్వం బలోపేతం అవుతుంది” అని బీఆర్ నాయుడు అన్నారు.
Also Read : అయ్యో పాపం.. టీ తాగుదామని రైలు దిగాడు, 20 ఏళ్లు నరకం చూశాడు.. ఓ వ్యక్తి దీనగాథ..
రోడ్డు సౌకర్యం ఉన్న ప్రధాన ప్రాంతాల్లో కనీసం 10 ఎకరాల భూమిని TTD కోరుతోంది. బాలాజీ ప్రధాన గర్భగుడి, నైవేద్యం సిద్ధం చేయడానికి వంటగది (పోటు), ఉత్సవ మండపం, పుష్కరిణి, యాత్రికుల సౌకర్యాల సముదాయాలు వంటి ముఖ్యమైన సౌకర్యాలతో కూడిన ఆగమ శాస్త్ర సూత్రాల ఆధారంగా ఈ ఆలయాలను నిర్మించనున్నారు. ఆలయాల నిర్మాణం పూర్తయిన తర్వాత.. ఆలయాలను TTD నిర్వహిస్తుంది. తిరుమలలో మాదిరిగానే ఆచారాలు , సేవలు నిర్వహించబడతాయి.
ప్రస్తుతం టీటీడీకి ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, భువనేశ్వర్, విశాఖపట్నంలో ఆలయాలు ఉన్నాయి. ముంబైలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. “దేశంలోని ప్రతి ప్రాంతానికి శ్రీ వెంకటేశ్వరుని ఉనికిని తీసుకురావడానికి, ఆలయాల నిర్మాణానికి మేము కట్టుబడి ఉన్నాము” అని బీఆర్ నాయుడు అన్నారు.