Vinutha Kotaa: చిందేపల్లిలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వినూత కోటా
చిందేపల్లి గ్రామంలో రోడ్డుకు అడ్డంగా కడుతున్న గోడ నిర్మాణం నిలిపివేసే వరకు దీక్ష విరమించేది లేదని వినూత కోటా దంపతులు స్పష్టం చేశారు.

Vinutha Kotaa: శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంఛార్జి వినూత కోటా తన భర్త చంద్రబాబుతో కలిసి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడవరోజుకు చేరుకుంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం చిందేపల్లి గ్రామం (Chindepalle Village)లో రోడ్డుకు అడ్డంగా నిర్మిస్తున్న లాంకో/ఈసీఎల్ సంస్థ కాంపౌండ్ వాల్ ను వ్యతిరేకిస్తూ వారు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గోడ నిర్మాణం నిలిపివేసే వరకు దీక్ష విరమించేది లేదని వారు స్పష్టం చేశారు.
గోడ నిర్మిస్తే ఐదు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోతాయని గత వారం రోజులుగా చిందేపల్లి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. గ్రామస్తులకు అండగా నిలబడ్డ జనసేన నాయకులు ఈసీఎల్ పరిశ్రమ వద్ద తమ మద్దతుదారులతో కలిసి ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. మూడు రోజులుగా దీక్ష చేస్తున్న వినూత (Vinutha Kotaa), ఆమె భర్త చంద్రబాబుకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. వినూత దంపతులకు ఏదైనా జరిగితే ఊరుకునేది లేదని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు.
సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదు
కాగా, మార్చి 10 నుంచి ఏప్రిల్ 9 వరకు శ్రీకాళహస్తి (Srikalahasti) పట్టణంలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ఎటువంటి సమావేశాలు, ర్యాలీలకు అనుమతి లేదని మూడు రోజుల క్రితం పోలీసులు రాతపూర్వకంగా వినూతకు తెలిపారు. తమ ఆదేశాలను ధిక్కరిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజల కోసం నిలబడితే పోలీసులను అడ్డం పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం తమను నిలువరించాలని చూస్తోందని వినూత ట్విటర్ లో మండిపడ్డారు.
సమస్యను పరిష్కరించాలి: నాదండ్ల మనోహర్
చిందేపల్లి గ్రామస్తుల సమస్యను పరిష్కరించాలని జనసేన పీఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్(Nadendla Manohar) డిమాండ్ చేశారు. చిందేపల్లి రోడ్డును ఓ కార్పొరేట్ కంపెనీ మూసేసి ప్రజలకు ప్రవేశం లేదని హుకుం జారీ చేస్తే జిల్లా ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడిగి చేస్తోందని ఆక్షేపించారు. ఆర్ అండ్ బీ పరిధిలోని రోడ్డు అకస్మాత్తుగా రికార్డుల నుంచి ఎలా మాయమైందని ప్రశ్నించారు. రహదారిని మూయవద్దన్న తమ పార్టీ నాయకులు, గ్రామస్తులపై పోలీసులు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన వారికి సంఘీభావం ప్రకటించారు. తిరుపతి జనసేన పార్టీ ఇంఛార్జి కిరణ్ రాయల్ మంగళవారం దీక్షాశిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించారు.
Also Read: కోనసీమ అల్లర్ల వెనుక జనసేన నాయకులు.. పవన్ కళ్యాణ్ ఖండించాలి