Kottu Satyanarayana : చిరంజీవి కంటే నువ్వు తోపు కాదు- పవన్ కల్యాణ్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్
వాలంటీర్ వ్యవస్థతో పెట్టుకున్నావంటే నీ రాజకీయ జీవితాన్ని నువ్వే అంతం చేసుకున్నట్లే.. Kottu Satyanarayana

Kottu Satyanarayana (Photo : Google)
Kottu Satyanarayana – Pawan Kalyan : ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్, అధికార పార్టీ నేతల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతోంది. ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను పవన్ కల్యాణ్ ఒకటంటే.. వైసీపీ నాయకులు రెండు ఎక్కువే అంటున్నారు. నువ్వెంత? అంటే నువ్వెంత? అంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ జనసేనాని పవన్ కల్యాణ్ పై నిప్పులు చెరిగారు. నువ్వు చిరంజీవి కన్నా తోపేమీ కాదంటూ పవన్ పై ధ్వజమెత్తారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పెంటపాడు గ్రామంలో నాల్గవ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ పాల్గొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లపై ఆయన విరుచుకుపడ్డారు. 14ఏళ్ళు ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు దుష్ట రాజకీయాలు చేస్తూ, దిగజారిపోయి రాష్ట్రంలో అల్లర్లు, అశాంతి సృష్టించాలని చూస్తున్నారు అని ఆరోపించారు.
Also Read..Hindupur : బాలయ్యను ఓడించేలా వైసీపీ భారీ స్కెచ్.. రెబెల్స్ తేనేతుట్టెను కదిపిన టీడీపీ..
వాలంటీర్లకు బాస్ ఎవరు అని పవన్ కల్యాణ్ అంటాడు. అసలు పవన్ కళ్యాణ్ కి బాస్ ఎవరు? చంద్రబాబా? అని ప్రశ్నించారు. చిరంజీవి కంటే నువ్వేమీ పుడింగి కాదని పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. చిరంజీవి పేరు చెప్పుకునే నువ్వు పైకి వచ్చావు అని పవన్ ను ఉద్దేశించి విమర్శించారు. కుళ్లు రాజకీయాలు చేస్తానంటే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.
”పవన్ కళ్యాణ్ కు సవాల్ చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్న ఏ క్లస్టర్ ని అయినా తీసుకో. అక్కడికి వెళ్లి వాలంటీర్ ను తీసుకెళ్లి మీ కుటుంబంకు ఏమైనా వాలంటీర్ వల్ల హనీ కలిగిందేమో అడుగు. వాలంటీర్ వ్యవస్థతో పెట్టుకున్నావంటే నీ రాజకీయ జీవితాన్ని నువ్వే అంతం చేసుకున్నట్లే. ఏం డేటా చోరీ చేసేస్తున్నారు? వాలంటీర్లు దగ్గర సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. దీంట్లో దేశ రహస్యాలకు సంబంధించిన డేటా ఏమన్న చోరీ చేస్తున్నారా? చంద్రబాబుకి తొత్తుగా ఎందుకు మారావు? చంద్రబాబుతో కలిసి నీ విలువ నువ్వే తీసుకుంటున్నావు. సామాజికవర్గ పరువు తీస్తున్నావు” అని పవన్ కల్యాణ్ పై ధ్వజమెత్తారు మంత్రి కొట్టు సత్యనారాయణ.