నడిపించే నాయకుడే లేడా? : జిల్లా సమస్యల్లో టీడీపీ ఫెయిల్‌!

  • Published By: sreehari ,Published On : December 19, 2019 / 10:37 AM IST
నడిపించే నాయకుడే లేడా? : జిల్లా సమస్యల్లో టీడీపీ ఫెయిల్‌!

Updated On : December 19, 2019 / 10:37 AM IST

ప్రభుత్వంపైన పోరాడేందుకు ఏ చిన్న అవకాశం చిక్కినా ప్రతిపక్షాలు వదులుకోవు. కానీ, తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం తనకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో ఫెయిలైపోతున్నదని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికార పార్టీ పాత్ర ఎంత ఉంటుందో, ప్రతిపక్ష పార్టీకి అంతే పాత్ర ఉంటుంది. అధికారంలో ఉన్న వారికి ప్రజా సమస్యలు పట్టకపోయినా ప్రతిపక్షంలో ఉన్న వారు మాత్రం తమ ఉనికిని చాటుకోవడానికైనా పోరాటాలు చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా తెలుగుదేశం పార్టీలో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి ముందుండి నడిపించే నాయకుడే లేకుండా పోయారని అంటున్నారు. 

ఎందుకు పోరాడలేకపోతోంది?
జిల్లాలో టీడీపీకి నలుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, సీనియర్ నాయకులున్నా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో విఫలమయ్యారనే టాక్‌ నడుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే గత ప్రభుత్వ హయాంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమాలను నిలిపివేసినా, మరికొన్నింటిని సక్రమంగా నిర్వహించలేకపోతున్నా ప్రశ్నించే నాథుడే కరువయ్యారట. ముఖ్యంగా వరద నష్ట పరిహారం, ధాన్యం కొలుగోలు కేంద్రాల ఏర్పాటు, వాటి నగదు చెల్లింపుల విషయంలో అధికార పార్టీని కనీసం ప్రశ్నించలేకపోతున్నారని అంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడంలో కానీ, నష్టపరిహారం అందించడంలో గత ప్రభుత్వం చాలా బాగా పని చేసిందని అటు అధికారులతో పాటు ఇటు జిల్లా వాసుల్లో వినిపిస్తున్న టాక్. 

వైసీపీ వైపు చూస్తున్నారా? :
జగన్ అధికారంలోనికి వచ్చిన తర్వాత జిల్లాను రెండు మూడుసార్లు వరదలు ముంచెత్తాయి. సహాయక చర్యల మాట ఎలాగున్నా ముఖ్యమంత్రిగా జగన్ ప్రకటించిన నష్టపరిహారమైనా అందుతుందని బాధితులు ఆశించారు. వరదలు పోయి నాలుగు నెలలైనా ఇంతవరకు వరద సహాయాన్ని ప్రభుత్వం అందించలేదంటున్నారు. ధాన్యం కొలుగోలు కేంద్రాల ఏర్పాటు, నగదు చెల్లింపుల విషయంలో గత ప్రభుత్వం పకడ్బందీగా వ్యవహరించేది. ప్రస్తుత ప్రభుత్వంలో వాటి వివరాలేవీ బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారట. 45 రోజులు అవుతున్నా కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యానికి రైతులకు ఒక్క పైసా కూడా చెల్లించలేదట. ఈ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో టీడీపీ నేతలు విఫలమయ్యారని జనాలు అనుకుంటున్నారు. ఆ నేతలు ఒకవేళ నేతలు వైసీపీలోకి వెళ్లిపోవాలని అనుకుంటున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

అందుకేనా..? పవన్ అత్యవసర టూర్ :
ప్రతిపక్ష పార్టీతో ఉపయోగం లేదనుకొని కొంతమంది రైతులు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆశ్రయించారట. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న అవకతవకలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్ళారట. రైతుల ఫిర్యాదులతో పాటు ప్రభుత్వం నుంచి కొంత సమాచారాన్ని సేకరించిన స్థానిక జనసేన నాయకులు.. దాని తీవ్రత బట్టి అత్యవసరంగా జిల్లాలో పవన్ టూర్ ఏర్పాటుచేశారని అంటున్నారు. పవన్ మండపేట పర్యటన షెడ్యూల్ ప్రకటించిన వెంటనే జిల్లాలో కొంతమంది ధాన్యం రైతులకు అర్ధరాత్రి చెల్లింపులు చేయడం, పవన్ సమావేశానికి వెళ్లనీయకుండా రైస్ మిల్లర్లను అడ్డుకోవడం బట్టి ఈ ఏడాది ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో ప్రభుత్వం వైఫల్యం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. కానీ, దీనిని టీడీపీ నేతలు క్యాష్‌ చేసుకోలేకపోయారట. 

కార్యకర్తల్లో అసంతృప్తి :
తాము చేయాల్సిన పోరాటాన్ని పవన్‌ చేయడంతో టీడీపీ నేతలపై ఆ పార్టీ కార్యకర్తలు గుర్రుగా ఉన్నారంటున్నారు. రానున్నది స్థానిక సంస్థల ఎన్నికల సమయం కాబట్టి ప్రభుత్వ వైఫల్యాలపై దూసుకెళ్లాల్సిన నాయకులు అసెంబ్లీకి పరిమితమైతే పార్టీ పరిస్థితి ఏంటని కార్యకర్తలు చర్చించుకుంటున్నారట. ప్రజాసమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలపై జిల్లా అభివృద్ధి సమావేశం నుంచి అసెంబ్లీ సమావేశాల వరకు ఏ ఒక్క సమావేశంలో కూడా ప్రతిపక్ష పార్టీ నాయకులు తమ పాత్రను నిర్వహించలేదని అంటున్నారు. ఇప్పటికైనా టీడీపీ నేతలు ముందుకొస్తే జిల్లాలో మైలేజీ పెరుగుతుందని సలహా ఇస్తున్నారు.