కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల చేరికపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు.. పురంధేశ్వరి పేరు ప్రస్తావన
ఎన్టీఆర్ కూతురు బీజేపీ అధ్యక్షురాలు అయినట్లే, వైఎస్ కూతురు కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అవుతుందేమో అని కామెంట్ చేశారు.

Kodali Nani Sensational Comments On YS Sharmila
Kodali Nani : వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడంపై వైసీపీ నేత కొడాలి నాని స్పందించారు. షాకింగ్ కామెంట్స్ చేశారు. వైసీపీపై షర్మిల ప్రభావం ఉండదని కొడాలి నాని తేల్చి చెప్పారు. అంతేకాదు ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి పేరుని ఆయన తెరపైకి తెచ్చారు. ఎన్టీఆర్ కూతురు బీజేపీ అధ్యక్షురాలు అయినట్లే, వైఎస్ కూతురు కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అవుతుందేమో అని కామెంట్ చేశారు.
Also Read : వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరికపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు..
పురంధేశ్వరి టీడీపీ ఓట్లు ఎన్ని చీల్చగలదో షర్మిల కూడా వైసీపీలో అన్నే ఓట్లు చీల్చగలదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. పురంధేశ్వరి ప్రభావం టీడీపీపై ఎంత ఉంటుందో.. షర్మిల ప్రభావం వైసీపీపై అంతే ఉంటుందన్నారు కొడాలి నాని.
”ఎన్టీఆర్ కూతురు పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలిగా ఉండి, 175 సీట్లు పోటీ చేస్తే టీడీపీ లాభమా? నష్టమా? ఎంతవరకు డ్యామేజ్ అవుతుంది? ఎన్టీఆర్ కూతురు బీజేపీలో ఉంటే అక్కడ ప్రభావం చూపించనప్పుడు ఇక్కడ మాత్రం ఏం ప్రభావం చూపిస్తారు? దాని వల్ల టీడీపీకి ఎంత డ్యామేజీ ఉంటుందో కాంగ్రెస్ వల్ల, వైఎస్ షర్మిల వల్ల మా పార్టీకి అంతే డ్యామేజ్ ఉంటుంది” అని కొడాలి నాని అన్నారు.
చంద్రబాబు నటన చూసి వాళ్లు చచ్చిపోయేవారు- కొడాలి నాని
”విజయవాడ ఈస్ట్ కి, సెంట్రల్ కి తేడా ఏంటి? విజయవాడ నగరం మొత్తం కలిసే ఉంటుంది కదా. అక్కడ పనికి రానోడు ఇక్కడ పనికొస్తాడా? అని చంద్రబాబు అడుగుతారు? కచ్చితంగా అక్కడ పనికి రానోడు ఇక్కడ పనికిరానోడు. కాకపోతే అక్కడ ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. వారికి ప్రాధాన్యత ఇవ్వాలంటే ఆ సీటు ఇవ్వగలం. సెంట్రల్ సీటు ఇవ్వలేము. వెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పని చేశాడు. వెల్లంపల్లి శ్రీనివాస్ కు అపారమైన అనుభవం ఉంది. వెస్ట్ నియోజకవర్గంలో ఏ రకమైన ఓటు బ్యాంకు ఉందో సెంట్రల్ నియోజకవర్గంలోనూ దాదాపు అదే ఓటు బ్యాంకు ఉంది.
అక్కడ వదిలేసి ఇక్కడికి రావాలంటే కొంత బాధ ఉంటుంది. లోకేశ్ మంగళగిరికి ఎందుకొచ్చాడు? బాలకృష్ణకి హిందూపురంకి ఏమైనా సంబంధం ఉందా? పవన్ కల్యాణ్ ది గాజువాకనా? భీమవరమా? ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తాడో తెలీదు. పనికిమాలిన వాళ్లు మాట్లాడే మాటలు. ట్రాన్సఫర్లు ఉంటాయా అంటూ చంద్రబాబు నటన చూస్తే ఎస్వీ రంగారావు, ఏఎన్నార్, ఎన్టీఆర్ వాళ్లు చచ్చిపోతారు ఒకవేళ ఇప్పుడు బతికుంటే. చంద్రబాబు నటనలో మనల్ని మించిపోయాడు అని చచ్చిపోయే వారు” అని కొడాలి నాని సెటైర్లు వేశారు.
జగన్ కు క్షమాపణ చెప్పాలి, తెలంగాణను ఏపీలో కలపాలి- కొడాలి నాని
”అండమాన్ లో అయినా ఏపీలో అయినా ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో పని చేస్తానని షర్మిల చెప్పారు. షర్మిల మరొకరా అనేది మేము చూడటం లేదు. కాంగ్రెస్ పార్టీని ఏపీ ప్రజలు తిరస్కరించడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి తల తోక లేకుండా రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఏపీని అనాథను చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీని ఆదరించి అనేక సంవత్సరాలు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారం ఇస్తే అడ్డగోలుగా ఏపీని విభజించి చేయరాని తప్పు చేసింది కాంగ్రెస్.
Also Read : సజ్జలతో గొడవపడినట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన గోరంట్ల మాధవ్.. ఏమన్నారంటే?
ఈ రాష్ట్రాన్ని మళ్లీ కలుపుతాను అని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఏమైనా పెడుతుందా? కాంగ్రెస్ దిగజారిన పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఆ పార్టీని రెండుసార్లు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి తోడ్పడ్డారు. అలాంటి వ్యక్తి చనిపోయాక ఆయనను ముద్దాయిని చేసి, ఆయన కొడుకును 16 నెలలు జైల్లో పెట్టించింది. ఈ రెండింటికి కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంది. ఏపీలో కాంగ్రెస్ కు మళ్లీ ఎంతో కొంత ఓటు షేర్ పెరగాలంటే ముందుగా జగన్ కు క్షమాపణ చెప్పాలి. రెండోది విడగొట్టిన రాష్ట్రాన్ని మళ్లీ కలుపుతానని మేనిఫెస్టోలో పెట్టి ముందుకెళితే అప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ను ఆదరిస్తారేమో? ఎవరిని తీసి ఎవరిని పెట్టినా? ఎవరు వచ్చినా ఎవరు పోయినా కాంగ్రెస్ పార్టీది వన్ పర్సెంట్ ఓటింగే. కాంగ్రెస్ చరిత్ర సమాప్తమైంది” అని కొడాలి నాని ఫైర్ అయ్యారు.