నా పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారు- ఏపీ బడ్జెట్‌పై జగన్ ఫైర్..
సూపర్ సిక్స్ పథకాలను ఎగ్గొట్టడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని..కూటమి సర్కార్ పై విరుచుకుపడ్డారు వైఎస్ జగన్.

Ys Jagan On Ap Budget (Photo Credit : Google)
Ys Jagan On Ap Budget : ఏపీ బడ్జెట్ పై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ప్రజలను మభ్యపెట్టే బడ్జెట్ ను ప్రవేశపెట్టారని విమర్శించారు. ప్రజలు నిలదీస్తారనే భయంతోనే పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టలేదని అన్నారు. బడ్జెట్ ప్రవేశపెడితే వాళ్ల మోసాలు బయటపడతాయనే భయం పట్టుకుందన్నారు. అందుకే, కూటమి ప్రభుత్వం ఇంతకాలం బడ్జెట్ పెట్టకుండా సాగదీసిందని ధ్వజమెత్తారు జగన్.
ఒక పథకం ప్రకారం వైసీపీ ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేశారని జగన్ ఆరోపించారు. పరిమితికి మించి అప్పులు చేశామని మాపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు జగన్. చంద్రబాబు మాటలన్నీ డ్రామాలేనని బడ్జెట్ లో తెలిసిపోయిందన్నారు. అబద్ధాలు చెప్పడం, ఏజెన్సీలకు ఫిర్యాదులు చేయడమే పనిగా పెట్టుకున్నారని జగన్ అన్నారు. నా పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని.. సూపర్ సిక్స్ పథకాలను ఎగ్గొట్టడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని..కూటమి సర్కార్ పై విరుచుకుపడ్డారు వైఎస్ జగన్.
”సీఎం చంద్రబాబు అబద్దాల బడ్జెట్ ప్రవేశపెట్టారు. చిత్తశుద్ధి ఉంటే హామీలకు బడ్జెట్ లో కేటాయింపులు చేయాలి. సాకులు చెబుతూ బడ్జెట్ పెట్టకుండా కాలాన్ని సాగదీశారు. అప్పు రత్న బిరుదు చంద్రబాబుకి ఇవ్వాలి. ఏపీ శ్రీలంకలా అయిపోతుందని ఒకప్పుడు తప్పుడు ప్రచారం చేశారు. నిజానికి.. చంద్రబాబు ఉంటేనే రాష్ట్రం శ్రీలంక అయ్యే అవకాశాలు ఎక్కువ. 2019లో చంద్రబాబు దిగిపోయే నాటికి 42,183 వేల కోట్ల బకాయిలు పెండింగ్ ఉంచారు. సూపర్ సిక్స్ ఎగ్గొట్టడానికి రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగోలేదని చెప్తున్నారు.
అంబానీ, అదానీ, బిర్లా కంపెనీలన్నీ మా హయాంలో వచ్చాయి. ఫిబ్రవరిలోనే రాష్ట్రంలో 8 ఇథనాల్ ప్రాజెక్టులు కట్టడం మొదలుపెట్టారు. మా హయాంలో ప్రారంభమైన వాటిని వీళ్ళు తెచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు. లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయని లోకేశ్ మన చెవుల్లో పువ్వులు పెడుతున్నారు. కడప స్టీల్ ప్లాంట్ కట్టడానికి సిద్ధమైన జిందాల్ ను దొంగ కేసులు పెట్టి భయపెడుతున్నారు. డిస్కమ్ లను సపోర్ట్ చేస్తేనే ప్రజలపై కరెంటు భారం తగ్గుతుంది. చంద్రబాబు ఐదేళ్లలో కేవలం 13 వేల కోట్లు ఇచ్చారు. మా హయాంలో 47 వేల కోట్లు ఇచ్చాం. ఐదేళ్లలో ట్రూ ఆఫ్ ఛార్జీలు లేకుండా ప్రజలపై భారం తగ్గించాం.
Also Read : వైఎస్ షర్మిల, సునీతలపై అసభ్యకర పోస్టుల వెనకున్నది ఎవరో తెలిసిపోయిందా?
5 నెలల్లో 17,892 వేల కోట్లు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో వసూల్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి డిస్కమ్ లకు డబ్బులు ఇస్తే ప్రజలపై భారం తగ్గుతుంది. ట్రూ ఆఫ్ ఛార్జీలు వసూల్ చేస్తూ మాపై వేలెత్తి చూపిస్తున్నారు. సంపద సృష్టి అని చెప్పుకునే చంద్రబాబు ఐదు నెలల్లో ఆదాయం తగ్గించారు. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రాకుండా దోపిడీ చేస్తున్నారు. ఇసుక, మద్యం నుండి ప్రభుత్వానికి ఆదాయం రాకుండా దోచేస్తున్నారు. ఇసుక రేటు డబుల్ అయ్యింది. ఎంఆర్పీ కంటే అధికంగా మద్యం అమ్ముతున్నారు. చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్, ఎమ్మెల్యేలు రాష్ట్రాన్ని దోచేస్తున్నారు” అని జగన్ ఆరోపించారు.