కర్నూలు వైసీపీని విడగొడుతున్న ఇద్దరు వీళ్లే..

కర్నూలు వైసీపీని విడగొడుతున్న ఇద్దరు వీళ్లే..

Updated On : March 11, 2020 / 10:08 PM IST

కర్నూలు జిల్లా వైసీపీలో అంతర్గత పోరు తారాస్థాయికి చేరింది. జిల్లాలో నియోజకవర్గ ఇంచార్జీలకు, ఎమ్మెల్యేలకు మధ్య ఆధిపత్య పోరు తీవ్రమైంది. నియోజకవర్గాల్లో ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి పెత్తనం కోసం పోట్లాడుకుంటున్నారట. జిల్లాలో ప్రధానంగా కర్నూలు, కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు వర్గాలుగా వీడిపోయి పార్టీలో చీలికలు తెస్తున్నారని సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. 

ముఖ్య నేతల మధ్య విభేదాలతో పార్టీ ప్రతిష్ట దిగజారుతోందని అంటున్నారు. ఈ విషయమై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు జిల్లా పార్టీ పెద్దలు సిద్ధమయ్యారని చెబుతున్నారు. కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్కు, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్రెడ్డి మధ్య విభేదాలు పతాకస్థాయికి చేరాయట. 

జిల్లా కేంద్రమైన కర్నూలు వైసీపీలో గ్రూపు రాజకీయాలకు తెరలేపడంతో జిల్లా అంతట పార్టీలో వర్గపోరుకు ఆజ్యం పోసినట్లయింది. ఎస్వీ మోహన్రెడ్డి, హఫీజ్ ఖాన్లు పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కర్నూలు నగరంలో పవర్ కోసం పోటాపోటీగా తలపడుతున్నారు. ఎమ్మెల్యే కాదని ఎస్వీకి అధికారులు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం, తనకు తెలియకుండా పార్టీలోకి ఇతర పార్టీల వారిని చేర్చుకోవడంపై హఫీజ్ ఖాన్.. సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారట. 

సీఎం జగన్ జిల్లా పర్యటన వేదికగా ఫ్లెక్సీల ఏర్పాటులో ఇద్దరి మధ్య చెలరేగిన వివాదం జిల్లాలో పెద్ద దూమారమే రేపింది. ఇద్దరి పంచాయితీ జగన్ దాకా కూడా వెళ్లింది. నందికొట్కూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆర్థర్, వైసీపీ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థరెడ్డిలకు ఒకరంటే ఒకరు పడటంలేదు. నందికొట్కూరు మార్కెట్ యార్డు చైర్మన్ ఎంపిక విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు ఏ స్థాయికి చేరాయంటే.. మధ్యలో తల దూర్చిన జిల్లా ఇంచార్జ్ మంత్రి అనిల్కి ఎమ్మెల్యే ఆర్థర్ అనుచరులు వార్నింగ్ ఇచ్చే దాకా వచ్చింది. 

తమ నియోజకవర్గం వ్యవహారంలో తలదూర్చితే జిల్లాలో తిరగనివ్వబోమని ఆర్థర్ అనుచరులు మంత్రి అనిల్ కుమార్‌ను హెచ్చరించారు. మంత్రి అనిల్ జిల్లాలో ఎక్కడ అడుగుపెట్టినా ఎదుర్కోవాలని ఆర్థర్ అనుచరులు పిలుపునిచ్చారు కూడా. తాము ఎవరికి భయపడేవాళ్లం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక కోడుమూరు విషయానికి వస్తే ఎమ్మెల్యే సుధాకర్, నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్రెడ్డి మధ్య వర్గపోరు నడుస్తోంది. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ ఉద్యోగుల ఎంపిక విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ప్రతిపాదించిన వారికి పోస్టులు ఇవ్వకపోవడం, ఇసుక రీచ్ వ్యవహారంలోనూ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయి. 

ఎమ్మెల్యే సుధాకర్‌కు సీఎం జగన్ సపోర్ట్ చేయడంతో ఎమ్మెల్యే హాజరయ్యే సభలకు కోట్ల హర్ష హాజరు కావడం లేదని నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు గుసగుసలాడుతున్నారు. జిల్లా వైసీపీలోని వర్గపోరును తెరదించేందుకు జిల్లా పార్టీ పెద్దలు కృషి చేస్తున్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం విభేదాలు వీడి కలసికట్టుగా పని చేయాలని సూచించారు. 

See Also | వీసాల్లేవమ్మా: ఏప్రిల్ 15వరకూ భారత్ దాటడానికి లేదు